Kadapa Crime News: భార్య లావుగా మారిందని పాలకోవాలో విషం కలిపి హత్య.. యూట్యూబ్‌లో వెతికి మరీ భర్త దారుణం
Viral News | భార్య లావుగా మారిందని, తనను అనుమానిస్తోందని కక్ష పెంచుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాలకోవాలో విషం కలిపి ఆమెను హత్య చేశాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ దారుణం జరిగింది.

Kadapa Crime News: ప్రొద్దుటూరు: కొందరు మనుషులు చాలా దారుణంగా ఆలోచిస్తున్నారు. ఏదో విధంగా జీవిత భాగస్వామిని హత్య చేయడానికి వెనుకాడటం లేదు. అలాంటి ఘటనే కడప జిల్లాలో జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్యను హత్య చేసిన ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో కలకలం రేపింది. కేవలం భార్య లావుగా మారిందని, దాంతో పాటు తరచుగా తనను అనుమానిస్తోందన్న కోపం పెంచుకున్న భర్త ఆమెకు పాలకోవాలో విషం కలిపి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ విబూకృష్ణ మంగళవారం మీడియాకు వెల్లడించారు.
బరువు పెరుగుతోంది.. అవమానిస్తోంది
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన భద్రిపల్లి కిరణ్‌కుమార్‌కు 8 ఏళ్ల కిందట ముద్దనూరుకు చెందిన పద్మజ (31)తో వివాహమైంది. పెళ్లి తర్వాత కిరణ్ తన అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు. గత ఐదేళ్లుగా ఇంటి నుండే జాబ్ (Work From Home) చేస్తున్నాడు. ఈ దంపతులకు సంతానం ఒక కుమార్తె ఉంది. అయితే, కొంతకాలం నుంచి పద్మజ బరువు పెరుగుతోంది. ఆమె శరీర ఆకృతి భారీగా మారడం, ఆమె జంక్ ఫుడ్ అలవాట్లు కిరణ్‌కు నచ్చలేదు. ఆమె బరువు గురించి గొడవలు జరిగేవి. దీనికి తోడు పద్మజ తనను అనుమానిస్తోందని కక్ష పెంచుకున్నాడు భర్త కిరణ్. దాంతో ఆమెను ఎలాగైనా చంపాలని భావించాడు.
యూట్యూబ్‌లో సెర్చ్ చేసి మరీ హత్య
భార్యను హత్య చేయాలని డిసైడ్ చేసుకున్న కిరణ్ గూగుల్, యూట్యూబ్‌లో విషంతో వ్యక్తిని చంపడం ఎలా? అని సెర్చ్ చేశాడు. ఆ క్రమంలో ఒక వీడియోలో దొరికిన నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాడు. దాదాపు రూ. 80 వేలు ఖర్చు చేసి కొరియర్ ద్వారా విషాన్ని తెప్పించుకున్నాడు. ఏప్రిల్ 29న తన తల్లిదండ్రులను చూద్దామని చెప్పి భార్య పద్మజను తన సొంతూరు ప్రొద్దుటూరుకు తీసుకువచ్చాడు. అక్కడ ఆమెకు ఇష్టమైన పాలకోవాలో కొరియర్ ద్వారా తెప్పించిన విషం కలిపి తినిపించాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే, దిండుతో ముఖాన్ని గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.
నేరం తనపైకి రాకుండా ఉండాలని భావించాడు. భార్య డెడ్‌బాడీని కొన్ని గంటల పాటు ఇంట్లోనే ఉంచి, తరువాత ఆమెకు గుండెపోటు వచ్చిందని అందరినీ నమ్మించాడు. పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేపించగా అసలు విషయం బయటపడింది. ఊపిరి ఆడకపోవడం వల్లే పద్మజ చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. దాంతో అనుమానం వచ్చి భర్త కిరణ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడు. ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీ, కాల్ డేటా ఆధారంగా పోలీసులు కిరణ్‌ను విచారించి నిజం రాబట్టినట్లు తెలుస్తోంది. అనంతరం నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ట్రెండింగ్ వార్తలు























