Srisailam: శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి - ఆలయ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం
ఉదయం 11.45 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం బయలుదేరి వెళ్లారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం (డిసెంబరు 26) శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రశాద్ ప్రోగ్రామ్ కింద శ్రీశైలం ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. తర్వాత శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శించారు. సాయంత్రం 4.15 గంటలకు శ్రీశైలం నుంచి హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకుంటారు.
శ్రీశైలం పర్యటన నేపథ్యంలో ఉదయం 11.45 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. సున్నిపెంట హెలిప్యాడ్ నుండి కాన్వాయ్ లో శ్రీశైలం అతిథి గృహానికి రాష్ట్రపతి చేరుకున్నారు. శ్రీశైల క్షేత్రంలో రు.43.08 కోట్లతో ప్రశాద్ స్కీం కింద వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ కూడా ఉన్నారు. సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, భారత పర్యాటక అభివృద్ధి, సంస్కృతి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, ఏడీ జీపీ ఎల్ఎల్ఓ రవిశంకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్జిలాని సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారత వాయుసేన విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సత్యవతి రాథోడ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంషాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లారు.
I humbly welcome and thank Smt. Droupadi Murmu ji, the Honourable President of India, @rashtrapatibhvn who will be inaugurating the project "Development of Srisailam Temple in the State of Andhra Pradesh" under the PRASHAD programme today.@kishanreddybjp @blsanthosh pic.twitter.com/sIYzshGUqT
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 26, 2022
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చారు. నేటి నుంచి 30 వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నియలంలో ఆమె బస చేయనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో బొల్లారం రాష్ట్రపతి నిలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి నిలయం చుట్టుపక్కల భద్రతను పూర్తిగా కట్టుదిట్టం చేశారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలోని 6 భవనాలు, వెలుపల ఉన్న 14 భవనాలను, చుట్టూ ఉన్న ప్రాంతాలను , ఉద్యాన వనాలను అందంగా తీర్చిదిద్దారు. తాగునీటి సదుపాయాన్ని మెరుగుపరచారు. అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృదం ఇప్పటికే బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని, పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. భద్రతా చర్యల్లో భాగంగా రాష్ట్రపతి నిలయంలో ప్రత్యేక ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేశారు. బొల్లారం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు జారీ చేశారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.