Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
Andhra Pradesh News | రాప్తాడులో చంద్రబాబు హయాంలో జాకీ కంపెనీ తీసుకొస్తే అప్పటి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు కోట్లు డిమాండ్ చేసి వెళ్లగొట్టారని పరిటాల సునీత ఆరోపించారు.
AP Assembly Sessions | అనంతపురం జిల్లా : రాప్తాడు నియోజకవర్గ ప్రజల వాణిని మరోసారి ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీలో వినిపించారు. అసెంబ్లీలో జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిన అంశం గురించి బుధవారం ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్ల జాకీ సంస్థ రాప్తాడు సమీపంలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందన్నారు. 2017లో పరిశ్రమ ఏర్పాటు కోసం 27 ఎకరాలను.. ఏపీఐఐసీ ద్వారా ఉత్తర్వులు ఇచ్చినట్టు గుర్తు చేశారు.
జాకీ సంస్థ వెళ్లిపోవడానికి కారణం అదే
రూ.129 కోట్లు పెట్టుబడి పెట్టి ఏటా 32.4 మిలియన్ల దుస్తులను తయారు చేసే పరిశ్రమ పనులు కూడా 2018లో ప్రారంభించారని తెలిపారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి.. మిషనరీలను కూడా తీసుకొచ్చిన సమయంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆసమయంలో అప్పటి YSRCP ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అతని సోదరులు పరిశ్రమ యాజమాన్యం నుంచి 15 కోట్లు డిమాండ్ చేశారని పరిటాల సునీత ఆరోపించారు. దీంతో పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిందని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ వలన సుమారు 6వేల మందికి ప్రత్యక్షంగా 4వేల మందికి పరోక్షంగా మొత్తం 10వేల మంది ఉపాధి కల్పించే అవకాశాన్ని కోల్పోయామన్నారు.
జాకీ పరిశ్రమ మళ్లీ ప్రారంభించాలని తెలుగుదేశం పార్టీతో పాటు సీపీఐ నాయకులు కూడా ఛలో జాకీ పరిశ్రమ కార్యక్రమాన్ని నిర్వహిస్తే.. పోలీసులతో నేతల్ని అక్రమంగా అరెస్టులు చేయించారని పేర్కొన్నారు. ప్రకాష్ రెడ్డి ప్రోద్బలంతో ఆ సమయంలో 40 మంది టీడీపీ, సీపీఐ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టించారు. ఇందులో నాతో పాటు పరిటాల శ్రీరామ్, సీపీఐ రామకృష్ణలు కూడా ఉన్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు ఎన్ని ప్రయత్నాలు చేసిన జాకీని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోగా.. వేరే గార్మెంట్స్ పరిశ్రమలు తీసుకొస్తామని ప్రగల్భాలు పలికారంటూ మండిపడ్డారు. కానీ నేటికీ ఆ భూముల్లో ఒక్క పరిశ్రమ కూడా రాని కారణంగా వృథాగా ఉన్నాయన్నారు. అందుకే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా గతంలో ఇచ్చిన ప్రోత్సాహాకాలు కొనసాగిస్తూ.. జాకీ పరిశ్రమ తిరిగి వచ్చేలా చూడాలన్నారు.
Also Read: AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
కంపెనీలు వస్తే వేల మందికి ఉపాధి
ప్రస్తుతం రాప్తాడు సమీపంలో విలువైన భూములు అందుబాటులో ఉన్నాయని.. ఆ స్థానంలో జాకీ పరిశ్రమ వస్తే 10వేల మందికి ఉపాధి ఏర్పడుతుందన్నారు. జాకీ పరిశ్రమ రాని పక్షంలో మరేవైనా ఇలాంటి పరిశ్రమలే తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. సభ అనంతరం గౌరవ స్పీకర్ గారి ఛాంబర్లో పరిటాల శ్రీరామ్ తో పాటు వెళ్లి భారీ, చిన్న తరహా పరిశ్రమల శాఖల మంత్రులు టి.జి. భరత్, కొండపల్లి శ్రీనివాస్ కు జాకీ పరిశ్రమను తిరిగి తీసుకురావాలని పరిటాల సునీత వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై మంత్రులు స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి పరిశ్రమలు నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.