(Source: ECI/ABP News/ABP Majha)
Muchumarri Girl Missing Case: ముచ్చుమర్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్- నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్సైపై వేటు
Muchumarri Girl Missing Case: ముచ్చుమర్రి బాలిక ఆదృశ్యం కేసులో ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించకుండా నిర్లక్ష్యం చేశారని ఇద్దరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Muchumarri Girl Missing Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటనలో ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు ప్రారంభించింది. బాలిక అదృశ్యమవ్వడం, ఇంకా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులపై వేటు వేసింది. ముచ్చుమర్రి ఎస్సై జయశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ముచ్చుమర్రిలో బాలిక మిస్సింగ్ విషయం తెలిసిన తర్వాత ఫిర్యాదు పట్ల బాధ్యతారాహితంగా నిర్లక్ష్యం వహించారని వీళ్లపై చర్యలు తీసుకున్నారు. నందికొట్కూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్సై ఆర్.జయ శేఖర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. కర్నూలు రేంజ్ డి.ఐ.జి CH. విజయరావు పేరుతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు
ఈ బాలిక ఆదృశ్యం కేసులో మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టిన పోలీసులు... 8 ఏళ్ల బాలికను రేప్ చేసి ముగ్గురు మైనర్లు హతమార్చారని చెప్పారు. వారంతా సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వివరించారు. చాక్లెట్ ఇస్తామని చెప్పి ఓ గుడిలో లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిపారు. ఆ విషయాన్ని ఆ బాలిక ఎవరికైనా చెప్పేస్తుందని భయంతో గొంతు నులిమి చంపేశారు. ఆ మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేశారు.
మైనర్‌లకు సహకరించిన తండ్రి
అయితే ఆ మైనర్‌లలో ఒకడు ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. ఆ వ్యక్తి వేరొకరి సహాయంతో బాలిక మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి నదిలో పడేశారు. బయటకు తేలితే అసలు విషయం వెలుగులోకి వస్తుదని మృతదేహానికి రాయి కట్టి కృష్ణా నదిలో విసిరేశారు.
పోక్సో చట్టం కింద కేసులు
తమ పిల్లలు కేసుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడతారని గ్రహించి ఆ తండ్రి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ కేసులో వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో వారిని ఏ4 ఏ5గా పెట్టారు.
ముచ్చుమర్రి బాలిక కేసు ఇంకా విచారణ దశలోనే ఉందన్నారు పోలీసులు, మృతదేహం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని దొరికే వరకు గాలిస్తూనే ఉంటామన్నారు. మొదట బాలిక మిస్సింగ్ కేసుగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తర్వాత 70/2, 103/1, 238ఏ సెక్షన్‌కు మార్చారు. పోక్సో చట్టం కింద కేసులు పెట్టారు.
ఊరిలో, స్కూల్స్‌లో కౌన్సిలింగ్
ఇకపై ఇలాంటివి జరగకుండా పెట్రోలింగ్ పెంచబోతున్నట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థులకు స్కూల్‌లలో గ్రామాల్లో తరచూ కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నామన్నారు. పార్క్‌లో ఆడుకుంటున్న చిన్నారి అదృశ్యమైందని మొదట సమాచారం తెలిసిందని... అయితే అక్కడ సీసీ టీవీ ఫుటేజ్‌లో చూస్తే వేరే వ్యక్తులు కూడా ఉన్నట్టు గుర్తించారు. వారిని ప్రశ్నిస్తే నిందులుగా ఉన్న మైనర్‌లు తీసుకెళ్లినట్టు తేలింది. వారిని పట్టుకొని ప్రశ్నించే కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి.
మృతదేహం దొరికే వరకు గాలింపు
అయితే కేసులో నిందితులు అరెస్టైనా బాలిక మృతదేహం లభ్యం కావడం లేదు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు రోజుల తరబడి కృష్ణా నదిని జల్లెడ పడుతున్నారు. అయినా మృతదేహం దొరకడం లేదు. అయినా వదిలే ప్రసక్తి లేదని డెడ్‌బారి దొరికే వరకు ఆపరేషన్ కొనసాగుతుందన్నారు పోలీసులు