Allagadda News: ఆళ్లగడ్డలో భగ్గుమన్న పాతకక్షలు, అఖిలప్రియా బాడీగార్డుపై దాడి
Nandyala News: ఆళ్లగడ్డలో పాతకక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. అఖిలప్రియా బాడీగార్డు నిఖిల్‌పై హత్యాయత్నం జరిగింది. గతంలో ఏవీసుబ్బారెడ్డిపై దాడికి ఇది ప్రతిదాడిగా అనుమానిస్తున్నారు.
Andhra Pradesh News: నంద్యాల జిల్లా ఫ్యాక్షన్ గడ్డ ఆళ్లగడ్డ(Allagadda)లో మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న పాతక్షక్షలు పోలింగ్ సందర్భంగా మళ్లీ పురుడుపోసుకున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ఆళ్లగడ్డలో తెలుగుదేశం అభ్యర్థి, మాజీమంత్రి అఖిలప్రియ(Akhila Priya) బాడీగార్డుపై హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన యువకుడి పరిస్థితి విషమంగా ఉంది...
భగ్గుమన్న పాతకక్షలు
ఏపీలో పోలింగ్ సందర్భంగా హింస పెద్దఎత్తున చెలరేగింది. తెలుగుదేశం (Telugu Desam), వైకాపా(YSRCP) వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఆస్తులు ధ్వంసం చేసుకున్నారు. అన్నిచోట్ల ప్రత్యర్థుల మధ్య గొడవలు జరిగితే ఆళ్లగడ్డ (Allagadda)లో మాత్రం ఒకే పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్యే ఘర్షణ చోటుచేసుకుంది. ఒకే పార్టీలో ఉంటూ ఉప్పు,నిప్పుగా మారిన మాజీమంత్రి భూమా అఖిలప్రియా, తెలుగుదేశం నేత ఏవీ సుబ్బారెడ్డి(A.V. Subba Reddy) వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. అధినేతకు ఇచ్చిన మాట ప్రకారం పోలింగ్ వరకు సంయమనం పాటించిన ఇరువర్గాలు... ఓటింగ్ ముగిసిన వెంటనే కొట్లాటకు దిగారు. అఖిల ప్రియ(Akhila Priya) బాడీగార్డుగా పనిచేస్తున్న నిఖిల్‌పై(Nikhil) హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దీనికి ఏవీ సుబ్బారెడ్డి వర్గమే కారణమని అఖిలప్రియ అనుమానిస్తోంది.
దాడికి ప్రతిదాడి
లోకేశ్(Lokesh) యువగళం పాదయాత్ర సందర్భంగా ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేసే సందర్భంలో ఇరువర్గాలు పోటీపడ్డాయి. ఆ సమయంలో అఖిలప్రియ వర్గీయులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడికి పాల్పడ్డారు. అప్పుడు అఖిలప్రియ( Akhila Priya) బాడీగార్డుగా పనిచేస్తున్న నిఖిల్ ఏవీ సుబ్బారెడ్డిపై చేయిచేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి( A.V.Subba Reddy) నోటి నుంచి రక్తం కూడా వచ్చింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియ అక్కడే ఉన్నారు. పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. ఈ వ్యవహారంపై అధినేత చంద్రబాబు(Chandra Babu) సీరియస్ అయ్యారు. ఇరువర్గాలను పిలిచి తీవ్రంగా మందలించారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఎవరి పరిధిలో వాళ్లు తమ పనిచేసుకుంటూ వెళ్లాలని సూచించారు. ఎన్నికలు ముగిసే వరకు ఇరువర్గాలు సైలెంట్ కాకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కూడా చెప్పారని తెలిసింది. దీంతో ఇరువర్గాలు చాలా సైలెంట్‌గా ఎవరి ప్రచారం వారు చేసుకున్నారు. దెబ్బతిన్న అవమానం నుంచి తేరుకుని ఏవీ సుబ్బారెడ్డి...అదునుకు ఎదురుచూశారు. ఆళ్లగడ్డలో ప్రశాంతంగా ఎన్నికలు ముగియడంతో పట్టరాని కోపంతో నిఖిల్‌పై దాడి చేయించినట్లు అఖిలప్రియవర్గం ఆరోపిస్తోంది. ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది.
గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఆళ్లగడ్డలో ఎలాంటి గొడవలు జరగలేదని ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటుంటే...ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న ఇరువురు నేతలు ఏకంగా దాడులు చేసుకోవడం చూస్తే మళ్లీ భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ దాడులు ఏ స్థాయిలోకి వెళ్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు ప్రాణస్నేహితులుగా ఉన్న భూమా, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాలు....నాగిరెడ్డి మరణానంతరం విడిపోయాయి. బినామీ ఆస్తులు, పదవుల పంపకాలే విభేదాలకు కారణమని తెలుస్తోంది.