Devaragattu Banni Festival: దేవరగట్టులో నేడు కర్రల సమరం.. బన్ని ఉత్సవానికి సర్వం సిద్ధం..
దేవరగట్టు బన్ని ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ఈరోజు అర్ధరాత్రి ఉత్సవం జరనుంది. కర్రల సమరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కర్రల సమరానికి సిద్ధమైంది. దసరా సందర్భంగా జిల్లాలోని హోళగుంద మండలం దేవరగట్టులో బన్ని జైత్రయాత్రను నిర్వహిస్తారు. దేవరగట్టులో 800 అడుగుల ఎత్తయిన కొండపై కొలువైన మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఉత్సవం జరగనుంది. ఈరోజు అర్ధరాత్రి మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయంలోని స్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు రెండు వర్గాలు కర్రలతో తలపడతారు. అరికెర, అరికెర తండా, ఎల్లార్తి, సుళువాయి, బిలేహాల్, కురుకుంద, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు ఒక వైపు.. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల వారు మరో వైపు రెండు వర్గాలుగా ఏర్పడి కర్రలతో కొట్టుకుంటారు.
ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు.. ప్రత్యేక నిఘా..
దేవరగట్టులో బన్ని ఉత్సవానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. డ్రోన్, సీసీ కెమెరాలు, ఫాల్కాన్ వాహనాలు ఏర్పాటు చేశారు. బన్నీ ఉత్సవాలకు రింగులు తొడిగిన కర్రలు తీసుకురావద్దని కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి సూచించారు. సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. వివిధ మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు కొండపైకి వాహనాల రాకను నిషేధించారు.
Also Read: ఆరెస్సెస్ ఆయుధ పూజ.. దేశ విభజనపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ఏడుగురు డీఎస్పీలు, 60 మంది ఎస్సైలతో భద్రత..
దేవరగట్టులో కర్రల సమరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ఏడుగురు డీఎస్పీలు, 60 మంది ఎస్సైలు, 23 మంది సీఐలు, 164 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 20 మంది మహిళా పోలీసులు, 322 మంది కానిస్టేబుళ్లను కేటాయించారు. మద్యం నియంత్రణకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో గ్రూపులను ఏర్పాటు చేశారు. కర్రల సమరంలో గాయాలైన వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య శాలను ఏర్పాటు చేశారు. దీనిలో 20 పడకలు ఉంటాయి. ఉత్సవం జరిగే ప్రాంత సమీపంలో 108 వాహనాలను అందుబాటులో ఉంచారు.
Also Read: శూలం, చక్రం, వజ్రాయుధం, పాశం, అక్షమాల, కమండలం..అమ్మవారి చేతిలో ఆయుధాల వెనుక ఆంతర్యం ఏంటంటే...
కొండ చుట్టూ విద్యుత్ సౌకర్యం..
దేవరగట్టు ఉత్సవం రాత్రి సమయంలో జరగుతుండటంతో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. చీకటిలో ప్రమాదాలు జరగకుండా కొండ చుట్టూ విద్యుత్ సౌకర్యం కల్పించారు. విద్యుత్ సేవల్లో అంతరాయం కలగకుండా ఆలూరు సబ్ డివిజన్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. భక్తుల కోసం ఉత్సవం ముగిసేవరకు తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వానలు
Also Read: 10, 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ కీలక ప్రకటన.. పరీక్షలు ఎప్పుడంటే?