Chandrababu: వివేకా హత్య కేసును ప్రజాకోర్టులో పెడతాం, గొడ్డలితో నరికి గుండెపోటు అంటారా?: చంద్రబాబు
Chandrababu Naidu: వివేకా హత్య కేసును ప్రజాకోర్టులో పెడతామని.. గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
Chandrababu Naidu: మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసును ప్రజాకోర్టులో పెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ కేసు ప్రపంచంలోని పోలీసు అధికారులకు కేస్ స్టడీ అని.. కేసులు నిందితులు సీబీఐ అధికారులను బెదిరించారని అన్నారు. వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని కడపలో ఏర్పాటు చేసిన సభలో అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీల పని పడతామని.. అడ్డుగా వచ్చిన వారందరినీ పక్కనపెడతాం అన్నారు. తండ్రిని చంపిన వారెవరో తెలియాలని వివేకా కుమార్తె సునీత ఇప్పటికీ పోరాడుతున్నారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రూ.5.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పారు.
తాము అధికారంలో ఉండి ఉంటే కడప స్టీల్ ప్లాంట్ పూర్తయ్యేదని చంద్రబాబు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారని ప్రశ్నించారు. జాబు రావాలంటే బాబు రావాలనేదే ప్రజల నినాదం అన్నారు. అలాగే జగన్ ప్రజలకు నమ్మకం కాదు రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థాయిలో కూడా వైసీపు ప్రభుత్వం లేకుండా పోయిందని అన్నారు. జగన్ సర్కారు వల్ల ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేడని అన్నారు. టీడీపీ హయాంలో మైక్రో, డ్రిప్, స్ర్పింకర్ పరికరాలు ఇచ్చినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా చేయాలనుకున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమలో ప్రాజెక్టులను పరుగులు పెట్టించామని చెప్పుకొచ్చారు.
ప్రకాశం జిల్లా నేతలతో మూడ్రోజుల పాటు చంద్రబాబు సమావేశం
ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. మూడు రోజులపాటు ఆయన జిల్లాలో మకాం వేయనున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని నిర్వహించే కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో నాయకుల పని తీరు, ఆశావహులకు బాబు భరోసా వంటి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి క్రిష్ణా జిల్లా టూర్ ను పూర్తి చేసుకున్నారు. ఇప్పడు ప్రకాశం జిల్లా పర్యటనకు రెడీ అవుతున్నారు. మూడు రోజుల పాటు మూడు ప్రాంతాల్లో చంద్రబాబు రోడ్ షోలు, బహిరంగ సభలను నిర్వహిస్తారు.
19వ తేదీన చంద్రబాబు దివంగత నేత బీ. వీరారెడ్డి కి నివాళులర్పిస్తారు. మద్యాహ్నం వరకు ఆయన బద్వేల్ వీరా రెడ్డి కన్వెన్షన్ లోనే ఉంటారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్, గిద్దలూరుకు చేరుకొని అక్కడ నుండి రాచర్ల గేట్, ఆర్టీసీ డిపో మీదగా వినూత్న విద్యా నికేతన్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడ బహిరంగ సభలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. 20వ తేదీన సాయంత్రం కుంభం రోడ్ జంక్షన్ నుండి చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారున. క్లాక్ టవర్ మీదగా ఎన్టీఆర్ సర్కిల్, ఎస్కేవీపీ కాలేజి గ్రౌండ్ వరకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు.