Srisailam News: శ్రీశైలంలో బులెట్స్ కలకలం, బాంబులు సైతం స్వాధీనం చేసుకున్న పోలీసులు
Andhra Pradesh News | నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలోని వాసవీ సత్రం సమీపంలో ఓ డివైడర్ వద్ద బుల్లెట్లు, బాంబులతో ఉన్న బ్యాగును గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు.

శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో బులెట్స్, కొన్ని బాంబులు వెలుగు చూడడం కలకలం రేపింది. శ్రీశైలంలోని స్ధానిక వాసవీ సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు దివైడర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బులెట్స్ సంచిని వదిలి వెళ్లారు. కొందరు కూలీ పని చేసే వారు ఆ సంచిని గుర్తించి చూడగా అందులో బుల్లెట్లు, బాంబులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బందోబస్తు విధులు నిర్వర్తించే ఏ.ఆర్ పోలీసులు, బాంబ్ స్క్వాడ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సంచిలోని బుల్లెట్లను తనిఖీ చేశారు. అందులో 303 కి చెందిన 6 బుల్లెట్లు, ఎస్. ఎల్ .ఆర్ కు చెందిన 5 బుల్లెట్లు, ఎస్. ఎల్ .ఆర్ కు చెందిన నాలుగు ఖాళీ బుల్లెట్లు , 9 ఎంఎం నాలుగు బుల్లెట్లు గుర్తించారు. బుల్లెట్లతో పాటు నాలుగు బాంబులను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బాంబులు వంకాయ బాంబులా లేక పేలుడు పదార్థాలా అని పోలీసులు అనుమానిస్తున్నారు.

బుల్లెట్లు, బాంబులు సంచిలో కనిపించిన ఘటనపై శ్రీశైలం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. బుల్లెట్లతో పాటు ఒక ఎర్ర గుడ్డ వాటి పక్కనే లభించడంతో నక్సల్స్ సంచారం ఏమైనా ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అనుమానాస్పదంగా బుల్లెట్లు, కొన్ని బాంబులు లభించడం స్థానికంగా కలకలం రేపింది.






















