Vangalapudi Anitha: ముచ్చుమర్రి బాలిక ఘటన, బాధిత కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం
Muchumarri Minor Girl Missing Case | నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో వారం రోజులు గడిచినా బాలిక మృతదేహం లభ్యం కాలేదు. బాధిత బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి అనిత ప్రకటించారు.
Muchumarri Minor Girl Rape Case | అమరావతి: నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాలిక మృతదేహం ఇంకా లభ్యంకాలేదు. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలతో వారం రోజుల నుంచి వెతికినా చిన్నారి మృతదేహం దొరకలేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ముచ్చుమర్రి బాధిత బాలిక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. బాధిత బాలిక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని హోం మంత్రి అనిత తెలిపారు.
విజయనగరంలో జరిగిన దారుణ ఘటనపై సైతం మంత్రి అనిత స్పందించారు. విజయనగరంలో ఊయలలో ఉన్న ఆరు నెలల పసికందుపై అత్యాచారం చేయడం దారుణమన్నారు. తాగిన మైకంలో ఓ వృద్ధుడు నెలల పాపపై అత్యాచారం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. లిక్కర్, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాలని సీఎం చెప్పారని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగితే నిందితుల్ని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. ముచ్చుమర్రి ఘటన, 6 నెలల చిన్నారిపై అత్యాచారం ఘటనలపై స్పెషల్ కోర్టు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. ముచ్చుమర్రి బాధిత బాలిక కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సాయం, విజయనగరంలో ఆరు నెలల చిన్నారి కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. అడపిల్లల్ని తప్పుగా చూసే వారికి, వారిపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ ఏ పార్టీ వాళ్లు అయినా ఊరుకునేది లేదన్నారు.
వారం రోజుల కిందట నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో 14 నుంచి 16 ఏళ్ల బాలురు ముగ్గురు ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారు. ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాల గ్రామంలో ఈ దారుణం జరిగింది. వారం దాటినా బాలిక మృతదేహం లభ్యం దొరకకపోవడంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని స్థానికులు చెబుతున్నారు.