కాపీ చంద్రబాబు బిసిబేళ బాత్, పులిహోరా మేనిఫెస్టో వండారు, పత్తికొండలో సీఎం జగన్ ఆగ్రహం
రాజమండ్రి మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్ సీరియస్ కామెంట్స్ చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో ప్రజల కష్టాలు, అవసరాల నుంచి పుడితే టీడీపీ మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందన్నారు ఏపీ సీఎం జగన్. అక్కడ విజయం కోసం రెండు పార్టీలు ఇచ్చిన హామీలతో బిసిబేళ బాత్ వండేశారని ఎద్దేవా చేశారు. ఆయనకు తెలిసిన మోసాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఆయన చేసిన ప్రకటనలు చూస్తే మారీచుడు, పూతన కథలు గుర్తుకు వచ్చాయని అన్నారు.
పత్తికొండలో సీఎం ధ్వజం
కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్.. చంద్రబాబుపై సీరయస్ కామెంట్స‌్ చేశారు. ఇంకా జగన్ ఏమన్నారంటే... వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరబెట్టుకోవచ్చని అన్న చంద్రబాబు, తొలి సంతకంతో రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను నిలువునా ముంచిన చంద్రబాబు రాజమండ్రిలో ఓ డ్రామా కంపెనీ మాదిరి షో చేశారన్నారు. ఆ డ్రామ పేరు మహానాడు అని పెట్టారు. ఆ డ్రామాలో అక్షరాల 27 సంవత్సరాల క్రితం చంపేసిన మనిషిని కీర్తిస్తూ దండలు వేస్తున్నారని విమర్శించారు.
పూతన, రావణుడు, మారీచుడు గుర్తుకు వచ్చారు
ఆకర్షణీయమైన మేనిఫెస్టో అంటు టీడీపీ అధినేత చంద్రబాబు ఓ ప్రకటన చేశారని... ఈ మాట వింటే చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు జగన్. కృష్ణుడిని చంపడానికి అందమైన లేడీ వేషంలో వచ్చిన పూతన కథ గుర్తుకు వచ్చిందని తెలిపారు. అందమైన లేడిగా వచ్చిన మారీచుడు గుర్తుకు వచ్చాడన్నారు. సీతమ్మను ఎత్తుకుపోవడానికి గెటప్ మార్చుకొని వచ్చిన రావణుడు గుర్తుకు వచ్చాడని పేర్కొన్నారు. ఈ ముగ్గురు ఆత్మలు కలిసి మన ఏపీలో ఓ మనిషిగా జన్మించాడు ఆయనే నారా చంద్రబాబు నాయడని విమర్సించారు.
ఎవరినైనా పొడస్తారు
ఈ చంద్రబాబు కేరెక్టర్ ఏంటంటే.. మేనిఫెస్టో పేరిట ప్రతి ఎన్నికలోనూ వేషం వేస్తారు. మోసం చేస్తారు. ఈయన సత్యం పలకరని, ధర్మానికి కట్టుబడరని. మాటపై నిలబడరని. విలువలు విశ్వసనీయత అసలేవు అన్నారు జగన్. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడుస్తారు. ఎన్నికలైపోయిన తర్వాత ప్రజలను పొడుస్తారు. అధికారం కోసం ఎవరినైనా పొడుస్తారు. చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీ ఏంటంటే... ఎన్నికల ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో.. తర్వాత ప్రజలను ఎన్నుపోటు పొడవడం అలవాటుగా మారిందని జగన్ విమర్శించారు.
మేనిఫెస్టో ఎలా తయారవుతుందా అనేది చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు జగన్. వైసీపీ మేనిఫెస్టో ఓదార్పు యాత్ర వల్ల, పాదయాత్ర వల్ల, ప్రజల ఆకాంక్షలు గుండె చప్పుళ్ల నుంచి పుట్టింది. రైతులు, ప్రాంతాలు, సామాజిక వర్గాల అవసరాల మధ్య, కష్టాలు నడుమ, మట్టి కోసం మేనిఫెస్టో పుట్టింది. చంద్రబాబు మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టింది. అక్కడ బీజేపీ కాంగ్రెస్ తలపడి అక్కడ పార్టీల హామీలతో బిసిబెళ బాత్ వండేశారు చంద్రబాబు అని అన్నారు. .
చంద్రబాబు జీవితమే కాపీ
బిసిబేళ బాత్ రుచిగా ఉంటుందో లేదో అని ఆలోచించి వైసీపీ పథకాలు కూడా చంద్రబాబు కాపీ కొట్టి మరో పులిహోరా వండేశారు. వైఎస్ పథకాలు కాపీ, జగన్ పథకాలు కాపీ, బీజేపీ పథకాలు కాపీ, కాంగ్రెస్ పథకాలు కాపీ చివరకు చంద్రబాబు బతుకే కాపీ మోసం అన్నారు జగన్. బాబుకు ఒరిజినాలిటీ లేదు పర్శనాలిటీ లేదు, క్యారెక్టర్ లేదు, క్రెడిబిలిటీ లేనే లేదు అన్నారు.
పోటీకి అభ్యర్థులు లేరు
పోటీ చేసేందుకు 175 మంది అభ్యర్థులు కూడా లేని పార్టీ. మైదానాల్లో మీటింగ్‌లు పెడితే జనాలు రారని భావించి సందులు గొందులు వెతుక్కునే పార్టీ ఇది. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ ఇది. ఏ గడ్డైనా తినడానికి వెనుకాడని పార్టీ ఇది. విలువలు, విశ్వసనీయత లేని చంద్రబాబు పార్టీ. జనంలో లేని పార్టీకి కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయ్యుక్తులు. ఇదే వీళ్ల పార్టీ ఫిలాసఫీ అని జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
ఒక్క మంచి చెప్పుకోలేని బాబు
1995లో సీఎం అయ్యారు. 30 ఏళ్ల తర్వాత కూడా ఎన్నికలు మళ్లీ వస్తున్నా ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా... మరో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా అంటారే తప్పా... సీఎం గా ఉన్నప్పుడు చేసిన మంచి చెప్పులేని వ్యక్తి చంద్రబాబు అన్నారు జగన్. ఈ రాష్ట్రంలో కోటిన్నర ఇళ్ల ముందు నిలబడి ఈ మంచి చేశానని చెప్పలేని ఈ బాబు... సామాజిక వర్గాల ముందు నిలబడి ఈ హామీ నెరవేర్చాను అని చెప్పలేని బాబు... చేసిందల్లా నమ్మిన రైతులను, నమ్మిన మహిళను, నమ్మిన యువతను, నమ్మిన ముసలివాళ్లను అందర్నీ హోల్‌సేల్‌గా మోసం చేశారన్నారు. అప్పులపాలు చేశారు. నట్టేట ముంచారని ధ్వజమెత్తారు.
కొంగ జపం మొదలు పెట్టారని విమర్శ
మొదటి సంతకం చేస్తున్నామంటే క్రెడిబిలిటీ ఉంటుందన్నారు సీఎం. చంద్రబాబు మొదటి సంతకాలనే మోసంగా వంచనగా దగాగా మార్చేశారు. మరోసారి మళ్లీ కొత్త వగ్దానాలతో జనం ముందుకు వస్తున్నారు. కొంగ జపం మొదలు పెట్టారు అనేది గమనించాలన్నారు. చంద్రబాబు డిక్షనరీలో మంచి చేయడం అనేది లేదని ధర్మంగా రాజకీయాల్లో పోరాటం, విలువలు విశ్వసనీయతతో పోరాటం, ఒంటరిగా పోటీ చేయడం లేవని విమర్శించారు.
చంద్రాబుబ ఆయన గంజదొంగల ముఠా, వీళ్లకు ఓ దత్త పుత్రుడు చేస్తున్నది రాజకీయ పోరాటం కాదని అధికారం కోసం ఆరాటమన్నారు. దోచుకోవడానికి పంచుకొని తినడానికే వీళ్లకు అధికారం కావాలన్నారు. రాబోయే రోజుల్లో డీబీటీకీ బీపీటీ మధ్యే యుద్ధం జరగబోతుందన్నారు. ఏది కావాలో ప్రజలు నిర్మయించుకోవాలి. పెత్తందారీ భావజాలానికి, పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. పేదవాడు తమవైపు ఉంటే పెత్తందారు అటువైపు ఉన్నారని చెప్పారు. సామాజిక అన్యాయానికి, సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. చంద్రబాబు పేదలతో యుద్ధం చేస్తున్నారన్నారు. తాను ప్రజలను నమ్ముతున్నానని వాళ్లే తనకు ధైర్యం అన్నారు జగన్.