Cricket Betting: అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసింది క్రికెట్ బెట్టింగ్ ముఠానే! భారీగా నగదు స్వాధీనం
Online Betting Gang In Anantapur | దులీప్ ట్రోఫీ సందర్భంగా అనంతపురం స్టేడియం వద్ద అనుమానంగా కనిపించిన కొందర్ని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆ వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తేల్చారు.
అనంతపురం: క్రికెట్ బెట్టింగ్ పై ఏబీపీ దేశం చెప్పింది నిజమైంది. దులీప్ ట్రోఫీ సందర్భంగా ఇటీవల కొందరు స్టేడియంలో అనుమానాస్పదంగా కనిపించగా అనంతపురం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింట్ నిర్వహిస్తున్నవారు కొందరైతే, ఆడుతున్నవారు కొందరు ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. క్రికెట్ బెట్టింగు నిర్వహిస్తున్న కర్ణాటకకు చెందిన 12 మంది, హర్యానా రాష్ట్రనికి చెందిన 7 మందిని మొత్తం పంతొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి మొత్తం 8,60,000 నగదు, 19 సెల్ ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు లోహిత్, అరుణ్, వికాస్, మధు, విశ్వాస్, నవీన్ కుమార్, మోహన్ కుమార్, సోంబేర్ సింగ్, శివానంద గౌడ్, రోహిత్, సందీప్ కుమార్, ధీరజ్ కుచ్, అనుభవ్ కుమార్, కౌశల్ కురణ.
దులీప్ ట్రోఫీ సమయంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
అనంతపురం జిల్లా కేంద్రంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కర్ణాటక, హర్యానాకు చెందిన క్రికెట్ బెట్టింగ్ ఆడేవారిగా పోలీసులు గుర్తించారు. వీళ్లు క్రికెట్ లైవ్ మ్యాచులు జరిగితే అక్కడకు వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తూ మొబైల్ అప్లికేషన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ ఆడుతుంటారు. ఆ క్రమంలో అనంతపురము జిల్లా RDT స్టేడియంలో జరిగిన దులీప్ ట్రోఫీలో భారత్ A, భారత్ B, భారత్ C, భారత్ D గ్రూప్ గా మ్యాచ్ లు జరిగాయి. ఆ మ్యాచ్ లని లైవ్ లో చూస్తూ బెట్టింగ్ ఆడుతున్నారు. బెంగళూరు సిటీ నుండి 12 మంది కలిసి మొదటిసారి దేశవాళీ దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ కోసం అనంతపురం వచ్చారు. మ్యాచ్ లైవ్ చూస్తూ ఏదైనా ఓవర్ కు ఓవర్ కు మధ్య కొంత టైం దొరికితే.. మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ ఆడి డబ్బులు సంపాదించాలని భావించారు.
సెప్టెంబర్ 22న ఇండియా ఏ, సీ జట్ల మధ్య జరిగిన దులీప్ ట్రోఫీ టెస్ట్ క్రికెట్ మ్యాచ్, ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ కు సంబంధించి బెట్టింగ్ ఆడారు. కొన్ని మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆడాలని, హర్యానాకు చెందిన 7 మంది క్రికెట్ బుకీలను సమకూర్చుకున్నారు. వారు వచ్చిన రెండు కార్లలో కూర్చొని అందులో శివానంద గౌడ తన స్నేహితుడు అభి సహాయంతో పరిచయం అయిన పోర్చుగల్ దేశానికి చెందిన పాల్ సూచనల మేరకు, టెస్కాన్ అనే వ్యక్తికి ఇండియా A, C జట్ల మధ్య జరిగిన టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కు లైవ్ కామెంటరీ ఇస్తూ బెట్టింగ్ కు హెల్ప్ చేశాడు. అదే సమయములో హర్యానాకు చెందిన అభినవ్ కుమార్ టెలిగ్రాం యాప్ ద్వారా పరిచయం అయిన వ్యక్తికి రూ.2 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించాడు. దాంతో బంగ్లాదేశ్ V/s ఇండియా టెస్ట్ మ్యాచ్ లైవ్ కామెంటరీని టెలిగ్రాం యాప్ ద్వారా పొందుతూ బెట్టింగ్ కొనసాగించారు.
బెట్టింగ్ అని ముందే పసిగట్టి..
అనంతపురం స్పోర్ట్స్ విలేజ్ లో జరుగుతున్న మ్యాచ్ పై బెట్టింగ్ ఆడుతున్న కొందరిని అదే రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ల ద్వారా బెట్టింగ్ నడుపుతున్నారా అని ఏబీపీ దేశం అనుమానాలు వ్యక్తం చేసింది. సరిగ్గా పోలీసుల విచారణలో అదే తేలింది. వీరంతా లైవ్ మ్యాచ్ చూస్తూ బాల్ టూ బాల్, ఓవర్ టు ఓవర్ మధ్యలో వచ్చే కొన్ని సెకన్ల గ్యాప్ లో బెట్టింగ్ వేసి డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు.