Congress Sailajanath : సీఎం జగన్ అప్పుల అప్పారావు, మంత్రులు భజనగాళ్లు - శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు
Congress Sailajanath : వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించేలా విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. సీఎం జగన్ అప్పుల అప్పారావుగా మారారని విమర్శించారు.
Congress Sailajanath : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దివాలా తీస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. కర్నూలులో మాట్లాడిన ఆయన... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పుల అప్పారావుగా అప్పులు చేస్తున్నారని విమర్శి్ంచారు. సీఎం జగన్ ఏ మొహం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దిల్లీకి వెళ్లిన ఆర్థిక మంత్రి బుగ్గనను బయటకు పంపి ప్రిన్సిపల్ సెక్రెటరీకి చివాట్లు పెట్టారన్నారు. వైసీపీ నేతలు దిల్లీలో మర్యాద పోగొట్టుకొని రాష్ట్రం పరువు తీస్తున్నారని మండిపడ్డారు. విద్యా దీవెన, అమ్మ ఒడి ఏ పథకమైనా సరే రాష్ట్ర ప్రజలను బిక్షగాళ్లు చేశారని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
మంత్రులు భజనగాళ్లు!
రూ.లక్ష కోట్లు ప్రజలకు ఇచ్చామన్న సీఎం జగన్, రూ.75 వేల కోట్లకు లెక్కలు చెప్పడంలేదని శైలజానాథ్ ఆరోపించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఏ మాత్రం పౌరుషం ఉన్న మంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో మందులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆక్షేపించారు. రాష్ట్ర మంత్రులు భజనగాళ్లుగా మారారని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
అత్యాచార ఘటనలకు రేటు!
రాష్ట్రంలో ఎక్కడ అత్యాచార ఘటన జరిగినా వాటిని రేటు కడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. పరిపాలన ఎలా చేయాలో చంద్రబాబుతో సహా మిగతా పార్టీ నాయకులతో సలహాలు తీసుకుంటే మంచిదని హితవు పలికారు. ఈసారి ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలని సీఎం జగన్ అంటున్నారని, ఒక్కసారి అధికారానికే వైసీపీ పరిమితం అవుతుందని ఆరోపించారు.
ఒక్క ఛాన్స్-ఒక్కసారి అధికారానికే పరిమితం : కన్నా లక్ష్మీనారాయణ
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఒక్కసారికే పరిమితమవ్వడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గుంటూరులో లైవ్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో అరాచక పాలనా నడుస్తుందన్నారు. విద్యుత్, ఇసుక, ఆర్టీసీ బస్సు ఛార్జీలు, నిత్యావసర ధరలు విచ్చలవిడిగా పెంచారని మండిపడ్డారు. గడిచిన మూడు సంవత్సరాలలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది తప్ప మరొకటి లేదన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఒక్క ఛాన్స్ కే పరిమితం అవ్వడం ఖాయమన్నారు.