AP Cabinet Meeting: అమరావతి పునర్నిర్మాణానికి SPV - ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
Andhra Cabinet: ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి పునర్నిర్మాణానికి SPV, ఆటో డ్రైవర్లకు 15 వేల సాయం సహా 20 అంశాలపై చర్చించారు.

Key decisions taken in AP cabinet meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో అమరావతి సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో 20 అజెండా అంశాలపై చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటు, ఆటో-క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం, భూసేకరణ విషయంలో కొత్త విధానాలు, పర్యాటకం, విద్యుత్, కార్మిక చట్టాల సవరణలు వంటి అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ. 15 వేల ఆర్థిక సాయం: శనివారం లాంఛన ప్రారంభం
కేబినెట్ సమావేశంలో మొదటి అజెండాలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందించే పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయవాడ సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ పథకం ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాల్లో మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు.
అమరావతి పునర్నిర్మాణానికి SPV ఏర్పాటు: భూసేకరణకు కొత్త మార్గం
రాజధాని అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్, ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూములను భూసేకరణ ద్వారా సేకరించేందుకు ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ పనులను వేగవంతం చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ SPV ద్వారా రాజధాని ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడం, ఫండింగ్, మానిటరింగ్‌లు సులభమవుతాయని భావిస్తున్నారు. అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపుల ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపార.
లిఫ్ట్ పాలసీ 2024-29- టెక్నికల్ హబ్స్‌కు భూమి ఇన్సెంటివ్
ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024-29కు అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాలసీ ద్వారా టెక్నాలజీ, ఐటీ హబ్స్‌కు భూమి సబ్సిడీలు, ఇన్సెంటివ్‌లు అందించి, రాష్ట్రంలో ఉద్యోగాలు సృష్టించడానికి దోహదపడుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. అలాగే జలవనరుల శాఖలో వివిధ పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్యారవాన్ టూరిజం ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమృత్ పథకం 2.0 పథకంలో భాగంగా రియల్ ఎస్టేట్ , ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లకు మంత్రివర్గం ఆమోదం ఇచ్చింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో నేడు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది.#AndhraPradesh pic.twitter.com/QixG1inBg1
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 3, 2025
కుష్ఠు వ్యాధి పదాన్ని తొలగించేందుకు చట్ట సవరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సవరణ ద్వారా కుష్ఠ రోగులకు సామాజికంగా దూరం పెట్టడం తగ్గుతుందని, వారికి గౌరవప్రదమైన జీవనం అందుతుందని భావిస్తున్నారు.





















