Auto Drivers Sevalo Scheme: అక్టోబర్ 4న ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం, వారి ఖాతాల్లోకి రూ.15 వేలు జమ
Auto Drivers Scheme | అక్టోబర్ 4న ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్యాబ్, ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 వేలు జమ చేయనున్నారు.

Andhra Pradesh News | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ఆటో, క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త చెప్పింది. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. అక్టోబర్ 4వ తేదీన ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా అర్హత గల ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందుకోనున్నారు. గత ప్రభుత్వం వాహనమిత్ర కింద ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూర్చగా.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు కారణంగా ఇబ్బంది పడకూడదని క్యాబ్, ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
మొత్తం లబ్దిదారుల ఖాతాల్లో రూ.435 కోట్లు జమ
మొత్తం 3,23,375 దరఖాస్తులు రాగా, ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2,90,234 మంది డ్రైవర్లను అర్హులుగా గుర్తించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వారి ఖాతాల్లో మొత్తం రూ.435.35 కోట్లు జమ కానున్నాయి. అర్హులైన లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే ఆందోళన చెందవద్దని, సంబంధిత సమస్యను పరిష్కరించి వారి పేర్లను జాబితాలో చేర్చి ఆర్థిక సహాయం చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేశారు. ప్రతి ఏడాది ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సుమారు రూ.435 కోట్లు ఖర్చు చేయనుంది. ఆటో డ్రైవర్లతో పాటు క్యాబ్ డ్రైవర్లకూ ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం ద్వారా డ్రైవర్ల ఆదాయ భద్రతకు దోహదం చేస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
| సామాజిక వర్గాలు | లబ్ధిదారుల సంఖ్య | ఖాతాల్లో జమయ్యే నగదు | |
| 1 | వెనుకబడిన వర్గాలవారు (BC) | 1,61,760 | 242,64,00,000 |
| 2 | షెడ్యూల్డ్ కులాలు | 70,578 | 105,86,70,000 |
| 3 | కాపులు | 25,694 | 38,54,10,000 |
| 4 | షెడ్యూల్డ్ తెగ | 13,410 | 20,11,50,000 |
| 5 | రెడ్డి | 7,023 | 10,53,45,000 |
| 6 | ఈబీసీలు | 4,190 | 6,28,50,000 |
| 7 | మైనారిటీలు | 3,968 | 5,95,20,000 |
| 8 | కమ్మ | 2,607 | 3,91,05,000 |
| 9 | క్షత్రియ | 520 | 78,00,000 |
| 10 | బ్రాహ్మణ | 363 | 54,45,000 |
| 11 | ఆర్య వైశ్య | 121 | 18,15,000 |
| మొత్తం | 2,90,234 | 4,35,35,10,000 |
ఆటో డ్రైవర్ల సేవలో పథకం వివరాలు
- స్కీమ్ ప్రారంభం: అక్టోబర్ 4
- లబ్ధిదారులు: 2.9 లక్షల మంది డ్రైవర్లు
- ఆర్థిక సహాయం: రూ.15,000 వార్షికం
- మొత్తం ఖర్చు: రూ.435 కోట్లు
ఎవరికి: ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు
ఈ పథకం అమలు సందర్భంగా అధికారులు, డ్రైవర్ సంఘాలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంచి దీన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అర్హతల విషయంలో జాగ్రత్తగా పరిశీలన చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందాలని పేర్కొన్నారు.






















