Kanakamedala Ravindra Kumar: అదనపు సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల రవీంద్రకుమార్ - ఏపీకి దక్కిన కీలక పదవి
Additional Solicitor General: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు అదనపు సొలిసిటర్ జనరల్ పదవి లభించింది. మూడేళ్ల పాటు ఆయన ఈ హోదాలో ఉంటారు.

Kanakamedala Ravindra Kumar: దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి మరోసారి వెలిగింది. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) వంటి ప్రతిష్టాత్మక పదవికి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ, సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ ఇద్దరు సీనియర్ న్యాయవాదులను ASG హోదాలో నియమించింది. కనకమేడల రవీంద్ర కుమార్, దవీందర్ పాల్ సింగ్‌లను ఈ పదవిలో నియమించారు. వీరు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మూడేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. దీనికి సంబంధించి అండర్ సెక్రటరీ కుందన్ నాథ్ సంతకంతో కూడిన అధికారిక పత్రాలు ఇప్పటికే జారీ అయ్యాయి.
అదనపు సొలిసిటర్ జనరల్ హోదాలో కనకమేడల రవీంద్ర కుమార్ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున కీలక కేసులను వాదించనున్నారు. రాజ్యాంగపరమైన అంశాలు, అంతరాష్ట్ర వివాదాలు , ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు న్యాయపరమైన రక్షణ కల్పించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. కనకమేడల రవీంద్ర కుమార్ గత నాలుగు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో రాణిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా ఆయనకు మంచి పేరుంది.
Former TDP MP Kanakamedala Ravindra Kumar has been appointed as an Additional Solicitor General (ASG) of India.
— Hyderabad DNA (@HyderabadDna) December 23, 2025
The Central Government has officially issued a notification confirming his appointment, under which he will serve as the Government of India’s ASG in the Supreme Court… pic.twitter.com/PFeytZUjrF
2018-2024 మధ్య కాలంలో ఎంపీగా పార్లమెంటులో అనేక ప్రజా సమస్యలపై, చట్టపరమైన అంశాలపై గళం వినిపించారు. క్లిష్టమైన కేసులను డీల్ చేయడంలో ఆయనకు ఉన్న నేర్పును గుర్తించే కేంద్రం ఈ కీలక బాధ్యతను అప్పగించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన, అందునా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్ న్యాయవాదికి దేశ రాజధానిలో ఇంతటి ప్రాధాన్యత కలిగిన పదవి దక్కడం పట్ల న్యాయ వర్గాలు, రాజకీయ నాయకులు , అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది వ్యక్తిగతంగా ఆయనకు దక్కిన గౌరవమే కాకుండా, రాష్ట్రానికి కూడా గర్వకారణమని ప్రశంసిస్తున్నారు.





















