Mla Ravindranath Reddy : బాలకృష్ణ కొడితే అభిమానం, నేను చేస్తే తప్పా?- ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
Mla Ravindranath Reddy : మాజీ సర్పంచ్ దేశాయిరెడ్డితో ఉన్న చనువుతోనే చేయి చేసుకున్నానని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు.
Mla Ravindranath Reddy : బాలకృష్ణ కొడితే అభిమానం అంటున్నారని, అదే పని నేను చేస్తా తప్పా అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలం అలిదినె ఓబాయపల్లెలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేశాయిరెడ్డితో ఉన్న చనువుతో చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించి చూపిందన్నారు. కొన్ని పత్రికలు కరపత్రాలుగా తయారయ్యాయని విమర్శించారు. వారి రాతల ద్వారా సాధించేమీ లేదని 2019లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశారని ఆరోపించారు. అప్పుడు వచ్చిన ఫలితమే వచ్చే ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందన్నారు. దేశాయిరెడ్డి మాట్లాడుతూ తనపై ఉన్న అభిమానంతోనే ఎమ్మెల్యే కోప్పడ్డాడని తమకు ఎలాంటి విభేధాలు లేవన్నారు. తాము మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయులమని కొన్ని పత్రికలు, ఛానళ్ళు భూతద్దంలో చూపించాయన్నారు. తనను సంప్రదించి విషయం తెలుసుకొని వార్తలు రాయాలని సూచించారు.
అసలేం జరిగింది?
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలను, వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జులను ఇంటింటికి పంపి.. ప్రజలకు అందిన పథకాల గురించి ప్రచారం చేస్తోంది. అయితే కొన్ని చోట్ల అభివృద్ధి పనుల గురించి పథకాల గురించి నేతలకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తమకు ఎలాంటి లబ్ది చేకూరకపోయినా.. చేసినట్లుగా పాంప్లెట్లు ఇస్తున్నారని.. అర్హులమైనా పథకాలు ఇవ్వడం లేదని కొంత మంది ఫిర్యాదులు చేస్తున్నారు. మరికొంత మంది అభివృద్ధి పనుల విషయంలో నిలదీస్తున్నారు. ఇలాంటి చోట్ల ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సహహనం కోల్పోకుండా ప్రజలకు సమాధానం ఇస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం సహనం కోల్పోయి వివాదాస్పదవుతున్నారు. ఈ జాబితాలో కమలాపురం ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి చేరారు.
వీడియో వైరల్
కమలాపురం నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన సాయం గురించి చెప్పి ఓట్లు అడుగుతున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి.. విన్ పల్లె మండలం అందెల గ్రామంలోనూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఆయన గ్రామంలోకి వెళ్లిన సమయంలో గ్రామస్తులు ఒక్కసారిగా చుట్టుముట్టి గ్రామ సమస్యలు గురించి వివరించారు. కొంత మంది సమస్యలు చెబుతున్న సమయంలోనే ఓ వ్యక్తి తన సమస్యను చెప్పడానికి ప్రయత్నించాడు. ఒకటి, రెండు సార్లు ఎమ్మెల్యే ఆగమని చెప్పినా ఆయన వినపించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన రవీంధ్రనాథ్ రెడ్డి ఆయనపై గట్టి అరిచి.. చేత్తో ఒక్క దెబ్బ వేశారు. దీంతో ఆ వ్యక్తి సైలెంట్ అయ్యారు. తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి అందరితో మాట్లాడి వెళ్లిపోయారు. అయితే గ్రామస్తుడ్ని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేయి చేసుకుంటున్న వీడియోను ఓ వ్యక్తి మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. దాన్ని ఇతరులకు షేర్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో కడప జిల్లాలో వైరల్‌గా మారడంతో రవీంద్రనాథ్ రెడ్డి వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దురుసుగా ప్రవర్తించారని.. అధికారం ఉందనే అహంకారంతో ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.