JC Prabhakar : కేసులో అర్టీఓ, పోలీసు అధికారులూ ఇరుక్కుంటారు - ఈడీ కేసు తీసుకోవడం సంతోషమన్న జేసీ ప్రభాకర్ రెడ్డి !
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆర్టీఓ, పోలీసులు కూడా ఇరుక్కుంటారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఈడీ ఆస్తుల జప్తు చేసిన తరువాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
JC Prabhakar : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్.. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ఆస్తులను అటాచ్ చేయడంపై ఆయన భిన్నంగా స్పందించారు. ఈడీ విచారణ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు ఈడి రూపంలోనే దేవుడు ఉన్నాడని తాడిపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇందులో ప్రధాన సూత్రధారి అశోక్ లేలాండ్ కంపెనీ అని.... వారిని ముందు విచారణ చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అయితే ఇప్పటి వరకూ మాకు వాహనాలు అమ్మిన అశోక్ లైలాండ్ ని విచారణ చేయలేదన్నారు. నాగాలాండ్ అధికారులను ఎంక్వైరీ చేయాలన్నారు. సుమారు 38 కోట్ల స్కామ్ అంటున్నారు.. అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని జేసీ ప్రభాకర్ రెడ్డి దీమా వ్యక్తం చేస్తున్నారు. నాకు ఈడీ కేసు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని.. ఈ కేసులో ఆర్టీఓ, పోలీసు అధికారులు కూడా ఇరుక్కుంటారని జోస్యం చెప్పారు.
బీఎస్-4 వాహనాల కుంభకోణంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన సహచరులు, కంపెనీలకు చెందిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు.అశోక్ లేలాండ్ లిమిటెడ్ నుండి బిఎస్-3 వాహనాలను తగ్గింపు ధరకు కొనుగోలు చేసి, ఇన్‌వాయిస్ కాపీలను రూపొందించి బిఎస్-4 వాహనాలుగా నమోదు చేశారనే ఆరోపణలపై జెసి ప్రభాకర్ రెడ్డిపై ఇడి అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసిన ఈడీ ఈరోజు జేసీ ప్రభాకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది. ఈ కుంభకోణంలో అశోక్ లేలాండ్ పాత్రపై కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
బిఎస్-3 వాహనాలను 2017 ఏప్రిల్ నుంచి రిజిస్ట్రేషన్ చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అశోక్ లైలాండ్‌కు సంబంధించిన 153 వాహనాలను జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్‌రెడ్డి రెండు వేర్వేరు కంపెనీల పేరుతో తుక్కు కింద కొనుగోలు చేసి 2018లో నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వాహనాలను తరువాత ఆంధ్రప్రదేశ్‌కు బదిలీపై తెచ్చారు. ఇక్కడా రిజిస్ట్రేషన్ చేశారు. 2019లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిపై విచారణ చేపట్టింది. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన వారిపై రవాణా శాఖ అప్పట్లో కేసులు నమోదు చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడ్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
ఈ కేసుల విచారణ జరుగుతున్న క్రమంలోనే ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కూడా వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అంశంపై విచారణ చేపట్టింది. మాజీ ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి, జెసి.ప్రభాకర్‌రెడ్డి ఇళ్లలోనూ అప్పట్లో సోదాలు నిర్వహించింది. ఆ తరువాత రెండు సార్లు పిలిచి ప్రశ్నించింది. రూ.38.36 కోట్ల విలువైన వాహనాల అమ్మకాలు జరిగినట్టు ఇడి గుర్తించినట్టు ఈడీ చెబుతోంది. జేసీ కుటుంబానికి దివాకర్ ట్రావెల్స్ పేరుతో బస్సు సర్వీసులు ఉన్నాయి.గతంలో పెద్ద ఎత్తున నడిచేవి. అయితే ఇప్పుడు ఏపీ నుంచి ఆ బస్సుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్టీఏ అధికారులు టార్గెట్ చేయడంతోనే వ్యాపారాన్ని ఏపీలో ఆపాల్సి వచ్చిందని జేసీ వర్గీయులు ఆరోపిస్తూ ఉంటారు.