JC Prabhakar: కాంప్లెక్స్ ను కూల్చేస్తానంటూ జేసీ ప్రభాకర్ మాస్ వార్నింగ్!
JC Prabhakar: తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో దేవాలయానికి అడ్డుగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని జేసీ ప్రభాకర్ అడ్డుకున్నారు. ఒకవేళ నిర్మిస్తే కూల్చేస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు.
JC Prabhakar: సంచలనాలకు కేంద్ర బిందువు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తన వార్నింగుల పదును చూపించారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలోని ప్రసిద్ధ ఆలయం ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణాన్ని ఆయన అడ్డుకున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం కారణంగా దేవాలయం కనిపించకుండా పోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ధ్వజ స్తంభానికి దగ్గరగా ఈ నిర్మాణాలు చేపడుతుండటంతో ఏడాదికి ఒకసారి జరిగే రథోత్సవంలో తేరు లాగడానికి ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. దేవాదాయ శాఖ నుంచి అనుమతులు కూడా పొందకుండా చేపడుతున్న నిర్మాణాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
షాపింగ్ కాంప్లెక్స్ కూల్చేస్తానంటూ వార్నింగ్..
కాదు కూడదు అని నిర్మాణాలు చేపడితే కూల్చేస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు .ఆలయ పరిసర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ప్రజల అవసరాల దృష్ట్యా సానుకూల దృక్పథంతో ఆలోచించాలని లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆలయం ఎదుట రోడ్లకు ఇరు వైపులా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకుని దేవాలయ ఆదాయాన్ని పెంచితే తమకేమీ అభ్యంతరం లేదని అన్నారు. అలా కాకుండా భక్తులను, ప్రజలను ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఆయన అభిమానులు బాస్ ఇస్ బ్యాక్ అంటూ తెగ సంబరపడిపోతున్నారు.
వరద బాధితులకు ఇంకా సాయం అందలేదు..
అలాగే వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యకర్తలను గాలికొదిలేశారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. గడపగడపకు కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు తప్ప.. ఒక్క కార్యక్త కూడా ఎమ్మెల్యేల వెంట లేరన్నారు. అలాగే ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా ఏర్పడ్డ సమస్యలను ఏమాత్రం తగ్గించలేరని అన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చి కార్యకర్తల కంటే వాలంటీర్లే వైకాపా ఎమ్మెల్యేలకు ఎక్కువ అయ్యారని చెప్పారు. తెలుగు దేశం పార్టీలో పదువులు అనుభవించిన వారంతా కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు త్యాగాలు చేయాలని ఓవైపు చెబుతున్నప్పటికీ.. తమ నాయకులు సిద్ధం కాలేదన్నారు. తెదేపా కార్యకర్తలను జైళ్లకు పంపుతుంటే కూడా తమ పార్టీ నాయకులు కనీసం స్పందించడం లేదని అందుకే తమ పార్టీ మాదిరిగానే వైకాపా కూడా తయారైందన్నారు.
కొంత కాలం క్రితం జేసీ సోదరుల ఇంట్లో ఈడి దాడులు జరిగాయి. దాడుల తర్వాత సోదరులు ఇద్దరు సైలెంట్ అయిపోయారు. కనీసం మీడియా ముందు కూడా రాలేదు. దీంతో ఆయన అభిమానులు కూడా ఒకింత మౌనం వహించారు. చాలా రోజుల తర్వాత యాడికి దేవాలయం అంశంలో ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ తో మీడియా ముందుకు రావడంతో ఆయన అభిమానులలో ఆనందం నెలకొంది.