Janasena Vs Jagan: హామీలు నిజంగా అమలుచేస్తే, ఆ కార్యక్రమాలు ఎందుకు? సీఎం జగన్ కు జనసేన సూటిప్రశ్న
Janasena Leader Nadendla Manohar: సీఎం జగన్ ఈ 4 ఏళ్ల పాలనతో హామీలు 99 శాతం వరకు నెరవేర్చడం నిజమైతే.. స్పందన జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలతో పనేంటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
Janasena Leader Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను దాదాపు 99 శాతం పూర్తి చేశామని చెబుతోంది. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేశామని, కొత్త సంక్షేమ పథకాలు సైతం తీసుకొచ్చామని చెప్పడాన్ని జనసేన నేతలు తప్పుపడుతున్నారు. ఒకవేళ సీఎం జగన్ ఈ 4 ఏళ్ల పాలనతో హామీలు 99 శాతం వరకు నెరవేర్చడం నిజమైతే.. స్పందన జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలతో పనేంటని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
పరిపాలన అద్భుతంగా చేసి ఉంటే, ఇలాంటి కార్యక్రమాలు అవసరం లేదు అన్నారు. ఎవరికి సురక్షితంగా పరిపాలన అందించారో చెప్పాలన్నారు. స్పందన అయిపోయింది, జగనన్నకు చెబుదాం లాంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు జగనన్న సురక్ష ఉద్దేశం ఏంటో తమకు అర్థం కావడం లేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేద్దామంటే, జగనన్న వినడు. అధికారులు వినరు, ఎమ్మెల్యేలు కూడా వినిపించుకోరని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తీరును నాదెండ్ల ఎండగట్టారు. గడప గడపలో ఎన్నో చోట్ల ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీయడం నిజం కాదా అని ప్రశ్నించారు. అందువల్లే జనసేన చేపట్టిన కార్యక్రమాలలో వేలాదిగా వినతులు, సమస్యలు వస్తున్నాయని గుర్తుచేశారు.
మైనింగ్, చెరువులు, స్థలాలు, కాంట్రాక్టులు ఆఖరికి వికలాంగుల పింఛన్ల విషయంలోనూ అవినీతి, అక్రమాలే జరుగుతున్నాయని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆర్బీకేలలో రైతుల వద్ద లంచాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ దారుణాలను, వ్యవస్థలో లోపాలను జనసేన ప్రశ్నిస్తుందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాధితులకు అండగా నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను ప్రశ్నిస్తుంటే.. తట్టుకోలేక ఆయనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర సమస్యలు, వ్యవస్థలో లోపాలు, అవినీతికి పవన్ వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు అని నాదెండ్ల వ్యాఖ్యానించారు.
Also Read: Byreddy Chalo Delhi: జులై 28న ఛలో ఢిల్లీతో మరో పోరాటం, సీఎం జగన్ సైతం రావాలని బైరెడ్డి పిలుపు
పవన్ కళ్యాణ్ వార్నింగ్ తో దిగొచ్చిన జగన్ సర్కార్!
వారాహి యాత్రలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం బహిరంగ సభ తరువాత రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విరుచకుపడ్డారు. ఈ క్రమంలోనే జనసేన నెగ్గిన ఏకైక స్థానం రాజోలు నియోజకవర్గంలోని స్థానిక సమస్యలపై స్పందించారు. రాజోలు బైపాస్ రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉందని, 15 రోజుల్లో రోడ్డు వేయించకుంటే తానే శ్రమదానం చేసి రోడ్డు వేస్తానని హెచ్చరించారు. ఈనేపథ్యంలో అధికారులు స్పందించారు. రాజోలు ఎల్‌ఐసీ బైపాస్ రోడ్డులో ఆదివారం నుంచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలును జనసేన కార్యకర్తలు, వీర మహిళలు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. జనసేన అధినేత అధికారంలోకి రాకుండానే ఒక్క పిలుపుతో ప్రభుత్వం మెడలు వంచుతున్నారని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు.. ప్రజలు మాత్రం ఈ రోడ్డు పక్కాగా పుననిర్మించాలని కోరుతున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial