Nadendla Manohar: ఏపీలో రోడ్ల పరిస్థితి చూసి ప్రభుత్వం సిగ్గుపడాలి
అత్యంత భారీ మెజారిటీతో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.. ఏపీలో రహదారులు పరిస్థితి చూసి.. సిగ్గుపడాలని.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై నాదెండ్ల శ్రమదానం నిర్వహించారు. రోడ్డు మరమ్మతులు చేపట్టారు. నాలుగు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు రాక పోకలు సాగించే ఈ రోడ్ పరిస్థితి పై ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇదే కాకుండా జిల్లా లో అన్ని రోడ్లు ఇలాగే ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలో ఛిద్రమైన రహదారులను మరమ్మతు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ గతంలో సామాజిక మాధ్యమాలు వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేసిందని నాదెండ్ల అన్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేపట్టడకపోవడం తో అక్టోబర్ 2వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రహదారికి జనసేన శ్రేణులు మరమ్మతులు చేశాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ పాడైన రహదారుల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో శ్రమదానం ద్వారా జనసేన నేతలు రహదారులకు మరమ్మతులు చేస్తున్నారన్నారు.
ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవని ఈ నిరసనలతో రాజకీయ లబ్ధి వస్తుందని కాదని ప్రజలబాగు కోసం రోడ్లపై శ్రమదానం చేస్తున్నామని మనోహర్ వివరించారు. ఏపీలో రహదారుల పరిస్థితి గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుగా సమస్యను అందరి దృష్టికీ అధినేత పవన్ తీసుకువెళ్లారని పేర్కొన్నారు. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వానికి సమయం ఇచ్చినా స్పందించలేదన్నారు. జనసేన చేపట్టిన శ్రమదానం కార్యక్రమంతో ప్రభుత్వం స్పందించిన తీరు అప్పట్లో అందరూ చూశారని గుర్తు చేశారు.
త్వరలో జనసేన అధినేత పవన్.. జిల్లాల పర్యటనలో పాల్గొంటారని నాదెండ్ల వెల్లడించారు. సామాన్య ప్రజల కష్టాలను, వారు ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లను దూరం చేసేలా జనసేన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జనసేన అధినేత గతంలో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమానికి జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. శ్రమ దాన స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా రోడ్లు బాగు చేయడంపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. శ్రమదానం అనంతరం ఆ రహదారి పై పాదయాత్ర చేశారు. రైతులు, మహిళలు, యువకులతో వేర్వేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Also Read: భారత్‌కు వస్తున్నారా? అయితే ఈ 10 పాయింట్లు పక్కా గుర్తుంచుకోండి!
Also Read: ఏపీలో వరద బాధితులకు టాలీవుడ్ స్టార్స్ సాయం... చిరంజీవి, మహేష్, ఎన్టీఆర్ తర్వాత ఎవరు?
Also Read: ఏపీకి వరద సాయం రూ.895 కోట్లిచ్చాం .. విజయసాయిరెడ్డికి కేంద్రమంత్రి ఆన్సర్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి