(Source: ECI/ABP News/ABP Majha)
AP Floods : ఏపీకి వరద సాయం రూ.895 కోట్లిచ్చాం .. విజయసాయిరెడ్డికి కేంద్రమంత్రి ఆన్సర్ !
ఏపీ ప్రభుత్వానికి రూ. 895 కోట్ల వరద విపత్తు సాయం చేశామని కేంద్రం తెలిపింది. విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ సమాధానాన్ని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఇచ్చారు.
వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి రూ. వెయ్యి కోట్లు తక్షణ సాయం చేయాలని రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిపై కేంద్రం స్పందించింది. భారీ వర్షాలు, వరదల వలన సంభవించిన పంట, ఆస్తి నష్టానికి సంబంధించి రూ. 895 కోట్ల రూపాయలను రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా ముందస్తుగానే విడదల చేశామని తెలిపింది. కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం పంపారు.
ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినపుడు బాధితులకు తక్షణ సాయం, పునరావాసం కల్పించేందుకు ఎస్డీఆర్‌ఎఫ్ నుంచి నిధులను వినియోగించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1,192.80 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం వాటా 80 శాతం వాటా రూ. 895.20 కోట్లను రెండు వాయిదాల కింద కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే విడుదల చేసింది. 2020 అక్టోబర్‌లో కూడా భారీ వర్షాల కారణంగా పంటలు, రోడ్లు, భవనాలు, చెరువులు, విద్యుత్ సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ప్రాధమిక అంచనాల ప్రకారం నష్టం రూ. 4,450 కోట్ల వరకు ఉందని కాబట్టి సహాయ, పునఃనిర్మాణం పనుల నిమిత్తం తక్షణ సాయం కింద 1000 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు మంత్రి తెలిపారు.
Also Read : వరద బాధితులకు ఎన్టీఆర్ సాయం.. ఫ్యూచర్ సీఎం అంటూ కామెంట్స్..
విపత్తుల నిర్వహణ బాధ్యత ప్రాధమికంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది. విపత్తులు సంభవించినపుడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్ నుంచి నిధులను వినియోగించి సహాయ చర్యలు చేపట్టవలసి ఉంటుందని మంత్రి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన అనంతరం అవసరమైతే జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి నుంచి అదనపు సహాయం అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ నిధులు కేవలం సహాయ చర్యలకు మాత్రమే వినియోగించాలి తప్ప నష్టపరిహారం చెల్లించడానికి కాదని మంత్రి తన సమాధానంలో తెలిపారు.
Also Read : ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెప్పిన 'సిరివెన్నెల' కుటుంబం
2020 అక్టోబర్‌లో వచ్చిన తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు అక్టోబర్ 23న కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేశామని .. కేంద్ర బృందం నివేదిక, హై లెవెల్ కమిటీ ఆమోదం అనంతరం ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు రూ. 233 కోట్ల రూపాయలను విడదల చేయడం జరిగిందని కేంద్రమంత్రి తెలిపారు. కేంద్రమంత్రి సమాధానం ప్రకారం చూస్తే ఇక ప్రత్యేకంగా ఏపీకి కేంద్రం నుంచి వచ్చే సాయం ఏమీ ఉండదని అంచనా వేస్తున్నారు.
Also Read : ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసులు.. డిమాండ్లు పరిష్కరించకపోతే ఇక ఉద్యమమే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి