BC Declaration Pawan Kalyan : టీడీపీ జనసేన ప్రభుత్వంలో ఏటా రూ. 15వేల కోట్లు - బీసీ డిక్లరేషన్ సభలో పవన్ కల్యాణ్ హామీ
BC Declaration Pawan Kalyan : బీసీలకు ప్రతి ఏటా పదిహేను వేల కోట్లు కేటాయిస్తామని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. బీసీ డిక్లరేషన్ సభలో ప్రకటించారు.
Janasena chief Pawan Kalyan : జగన్ వచ్చిన వెంటనే లక్షల మంది బీసీ కార్మికుల పొట్టకొట్టారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన ‘జయహో బీసీ’సభలో ఆయన ప్రసంగించారు. వెన్నంటే ఉన్న బీసీలనే జగన్ దెబ్బకొట్టారని, ఏటా రూ. 15వేల కోట్లు కేటాయిస్తామని మోసం చేశారని విమర్శించారు. సంపద సృష్టించే స్థాయికి ఎదిగేలా బీసీలకు అండగా ఉంటామన్నారు. వైసీపీలో ఉన్న బీసీ నేతలు పునరాలోచించుకోవాలని హితవు పలికారు. బీసీలకు రక్షణ చట్టం అవసరం.. అందుకే మద్దుతు తెలిపానన్నారు. బీసీలకు సాధికారత ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని.. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయి బీసీలు ఎదగాలన్నారు. సంపద సృష్టించే స్థాయికి ఎదిగేలా బీసీలకు అండగా ఉంటామని.. మత్స్యకారుల కోసం ప్రతి 30 కి.మీ.కు ఒక జెట్టీ ఉండాలన్నారు.
బీసీ కులాలు యాచించే స్ధాయి నుంచి శాసించే స్ధాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాడినని పవన్ కళ్యాణ్ తెలిపారు. బీసీ కులాలు భారత దేశ సంస్కృతికి ప్రతిబింబం అన్నారు. భారత దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని కాపాడుతున్నది బీసీలే అన్నారు. బీసీ కార్పోరేషన్లకు కుర్చీలు లేవు, నిధులు లేవని పవన్ ఆరోపించారు. వైసీపీ పాలనలో 300 మంది బీసీల్ని చంపేశారన్నారు. కాబట్టి వైసీపీలో ఉన్న బీసీలు ఇవన్నీ గమనించాలని పవన్ కోరారు. బీసీ పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు. బీసీల దగ్గర డబ్బు ఉండకూడదనే దురుద్దేశంతో సీఎం జగన్ జీవో నంబర్ 2 తీసుకొచ్చారని పవన్ విమర్శించారు. 153 బీసీ కులాలకు ఆర్ధిక పరిపుష్టి చేకూర్చేందుకు జనసేన అండగా ఉంటుందన్నారు. బీసీలపై దాడులు జరిగితే తమ ప్రాణాలు అడ్డేసి అండగా ఉంటామన్నారు.
గత ఎన్నికలకు ముందు జయహో బీసీ అంటూ ఏలూరులో సభ పెట్టిన జగన్ అప్పట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. ప్రస్తుతం పేర్లు మార్చి అమలు చేస్తున్న పథకాలు కూడా అరకొరగానే ఇస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే ఇసుక ఆపేసి భవన నిర్మాణ రంగంలో ఉన్న బీసీలను జగన్ దెబ్బ కొట్టారని పవన్ మండిపడ్డారు. బీసీ కులాల్లో ఉన్న అనైక్యత కారణంగానే జగన్ ఇలా ఉన్నారని పవన్ తెలిపారు. బీసీ కులాలకు టీడీపీ-జనసేన రెండు పార్టీలు అండగా ఉంటాయని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అధికారం రాని కులాలకు అధికారం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఇంకా అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన కులాల్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. జగన్ అధికారంలోకి రాగానే బీసీ కులాల రిజర్వేషన్ తగ్గించారని, దీన్ని టీడీపీ-జనసేన అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామన్నారు.
పవన్ కల్యాణ్ బీసీ డిక్లరేషన్ స్పీచ్‌కు సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది. పలు వర్గాల సమస్యలపై ఆయన సావధానంగామాట్లాడారు. వైసీపీ పాలనలో జరిగిన నష్టాన్ని వివరించారు. ఆ నష్టాన్ని పూడ్చుకునేలా.. బీసీ డిక్లరేషన్ ద్వారా.. మేలు చేస్తామని హామీ ఇచ్చారు.