AP Officers To Jagan : "తిట్టమని" జగన్ ఆదేశాలు ! సివిల్ సర్వీస్ అధికారులు దూకుడు పెంచుతారా ? విపక్షంపై విరుచుకుపడతారా?
ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్న విపక్షం, మీడియాను తిట్టాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు. ఇక వారు వైఎస్ఆర్‌సీపీ నేతల తరహాలో దూకుడు పెంచుతారా?
AP Officers To Jagan : ప్రెస్‌మీట్లు పెట్టి సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారాలు చేసే ప్రతిపక్ష నేతలు, మీడియాను బాగా తిట్టండి అని సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాల కలెక్టర్లకు సూచించడం రాజకీయంగా చర్చనీయాంశమయింది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. పార్టీ నేతలతో ఇంత కాలం దారుమమైన తిట్లు తిట్టించిన జగన్ ఇప్పుడు అధికారులతో కూడా అదే పని చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని.. మండి పడుతున్నారు. ప్రభుత్వం, వైఎస్ఆర్‌సీపీ పాలనపై ప్రజలు నమ్మకం కోల్పోయారని ఇక అధికారులపై ఆధారపడుతున్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ ఇచ్చిన సూచనలు లేదా ఆదేశాలను అధికారులు ఎలా తీసుకుంటారన్నది సస్పెన్స్ గా మారింది. ప్రతిపక్షాలు. మీడియాపై వారు వైఎస్ఆర్‌సీపీ నేతల్లాగే ప్రెస్ మీట్లు పెడతారా ? దూకుడు పెంచుతారా ?
ప్రతిపక్షాలకు ఘాటు కౌంటర్లు ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
నిన్నటివరకు పార్టీ శ్రేణులు, వాలంటీర్లకే ప్రతిపక్షాలపై ఎదురుతిరగండి..నిలదీయండి అని చెప్పిన ఏపీ సిఎం జగన్ ఇప్పుడు అధికారులకు కూడా ఇదే ఆదేశాలు ఇవ్వడం రాజకీయంగా చర్చకు తావిస్తోంది. ఇప్పటికే యూనివర్సిటీలు, ప్రభుత్వశాఖలను పార్టీ కేడర్ గా వైసీపీ మార్చేసిందన్న విపక్షాల విమర్శలకు ఇప్పుడు జగన్ ఆదేశాలు మరింత ఊతమిస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని తగ్గించాలంటే ఇంత కంటే మార్గం లేదని జగన్ భావిస్తున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ సిఎంగా జగన్ పదవి చేపట్టినప్పటి నుంచి విపక్షాల విమర్శలకు అడ్డులేకుండా పోతోందన్నది అధికారపార్టీ ఆవేదన. దీనికి తోడు మీడియా కూడా అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తోందని చాలా సార్లు వైసీపీ నేతలే కాదు స్వయానా ముఖ్యమంత్రి కూడా ప్రజా సభల్లో అసహనం వ్యక్తం చేశారు. పదేపదే విషప్రచారాలు చేస్తోందని జగన్ ఆరోపించడమే కాదు ఇక పార్టీ శ్రేణులను కూడా ఎక్కడిక్కడ ఈ కుట్రలకు తెరదించాలని సూచించారు. అలాగే వాలంటీర్లని కూడా ప్రతిపక్షాలను అవసరమైతే నిలదీయమని సలహా ఇచ్చారు. దీంతో గత కొంతకాలంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి విపక్షాలతో వైసీపీ శ్రేణులు ఢీ అంటే ఢీ అన్న లెవల్లో పోరుబాట పట్టారు.
విపక్షాలు, మీడియాపై బూతులతో దాడి చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు !
ప్రెస్ మీట్ ద్వారా ఎప్పటికప్పుడు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు.. మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఇది చాలా వరకూ గీత దాటే ఉంటుంది. ఎక్కువగా ఘాటు పదజాలంతో విరుచుకుపడుతూ ఉంటారు. సిఎం జగన్ గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం వెనక ఉన్న అసలు కారణం ప్రజల్లో ప్రభుత్వం పట్ల విపక్షాలు పన్నుతున్న కుట్రలను తెలియజెప్పడమే అన్నది బహిరంగ రహస్యమేనని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇంత చేస్తున్నా ఇంకా జగన్ పాలనపై విపక్షాలు ఆరోపణలు చేయడమే కాకుండా వ్యతిరేక వార్తలను ప్రచారం చేస్తోందని భావించిన జగన్ దీనికి చెక్ పెట్టేందుకు అధికారులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఆరోపణలు చేసే విపక్షాలకు కలెక్టర్లు సరైన రీతిలో సమాధానం ఇవ్వమని ఆదేశించారు.
గట్టిగా తిట్టాలని కలెక్టర్లుకు చెప్పిన జగన్ !
తప్పు చేయనప్పుడు ఎందుకు విమర్శలు ఎదుర్కోవాలి అని చెబుతూ వ్యతిరేక ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని చెబుతూ విపక్షాలను నిలదీయమని ఆదేశించారు. ఇప్పటికే జగన్ తీరుపై విపక్షాలతో రాక్షస పాలనంటూ ప్రచారం చేస్తోంది. అంతేకాదు ఇప్పుడు విజయవాడ వేదికగా అఖిలపక్షం కూడా భేటీ అయి జగన్ పై పోరుకి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో సిఎం జగన్ ఈ అధికార-విపక్షాల పోరులో జిల్లా కలెక్టర్లని రంగంలోకి దింపడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయచదరంగంలో జిల్లా అధికారులే చివరకు బలిపశువులయ్యేదని కొందరు వాదిస్తుంటే మరికొందరు మాత్రం తప్పుడు వార్తలు ప్రచారం చేసినప్పుడు నిలదీయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే అధికారులపై ఒత్తిడి పెరిగిందన్న వార్తల నేపథ్యంలో సిఎం జగన్ ఆదేశాలను కలెక్టర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
విధేయ అధికారులు మరింత జోరు చూపించే అవకాశం
ప్రస్తుతం సివిల్ సర్వీస్ అధికారుల్లో చాలా మంది ప్రభుత్వం చెప్పినట్లుగా చేసేవారున్నారు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన వారే కీలకమైన స్థానాల్లో ఉన్నారు. అలాగే కలెక్టర్లు, ఎస్పీలు కూడా అత్యంత నమ్మకస్తులే ఉన్నారు. ఇప్పుడు జగన్ నేరుగా తిట్టమని ఆదేశించినందున ఇలాంటి వారు ఇక ముందు మీడియా సమావేశాలు పెట్టి ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఏపీలో సరికొత్త రాజకీయ వాతావరణం ఏర్పడనుందని భావిస్తున్నారు.