YSRCP News : 18 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్ - గడప గడపకూ వర్క్ షాప్‌లో సీఎం జగన్ సీరియస్ !
18 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని సీఎం జగన్ మందలించారు. వారిలో మార్పు రాకపోతే మార్చేస్తానన్నారు.
YSRCP News : గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్‌లో 18 మంది ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాయంలో గడపగడపకు మన ప్రభుత్వం వర్కుషాప్ జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించిన సీఎం... 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్టి వ్యక్తం చేశారు. వీరందరని త్వరలోనే వ్యక్తిగతంగా పిలిచి చెబుతాను.. అప్పటికీ పనితీరు మార్చుకోపోతే నా నిర్ణయం నేను తీసుకుంటానని జగన్ హెచ్చరించారు.
సగం మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం జగన్
మిగతా వాళ్లలో కూడా దాదాపుగా సగం మంది పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. పనితీరు బాగుంటేనే ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. పనితీరు బాగోలేకపోతే కొనసాగించడం పార్టీకి నష్టమవుతుంది. ఇప్పటి వరకూ చేసిన సర్వే వివరాలన్నీ నా వద్ద ఉన్నాయి. ఇక్కడి నుంచి చేసే సర్వేలో మీ గ్రాఫ్‌లు పెరగాల్సిందేనని స్పష్టం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మీరు గ్రాఫ్ పెరిగేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. మీరు ప్రతి ఇంటికీ వెళితే గ్రాఫ్ పెరుగుతుంది.... లేకపోతే మీ గ్రాఫ్ పెరగదని జగన్ స్పష్టం చేశారు. మీరు బాగా పనిచేస్తే పార్టీకి ఉపయోగం ఉంటుంది. అలా జరగకపోతే మిమ్మల్ని మార్చడం మినహా నాకు వేరే ప్రత్యామ్నాయం ఉండదని స్పష్టం చేశారు.
టిక్కెట్ ఇవ్వలేకపోతే నేను బాధ్యడిని కాదు !
మీ పనితీరు బాగోలేని పక్షంలో టిక్కెట్లు ఇవ్వను.... చివరిలో మీరు నన్ను బాధ్యుడిని చేయవద్దని ఎమ్మెల్యేలకు జగన్ స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు మనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని ఇందుకు దీటుగా సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా మనం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఉపయోగించుకొని అబద్దాలు, విషప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అలాగే రెండు రోజుల్లో ప్రారంభం కానున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అందరూ ఛాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు. ప్రతీ సచివాలయానికి ఎమ్మెల్యే, అధికారులు వెళ్లి కూర్చొని ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. వారు అడిగిన ప్రతీ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. జనం అడిగిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అధికారులు కూడా వాటిని పరిష్కరించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల్లోకి వెళ్లడంపై దిశానిర్దేశం చేశారన్న వైసీపీ నేతలు
మరోసారి ఎప్పుడు వర్క్ షాప్ జరుగుతుందో స్పష్టత లేదు కానీ.. ఎమ్మెల్యేలతో వన్ టు వన్ భేటీలు నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. జగన్ ఆగ్రహానికి గురైన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు.. పార్టీ ఖరారు చేసిన ఇతర కార్యక్రమాల వల్ల గడప గడపకూ తరచూ వెళ్లకేపోయారన్న వాదన వినిపిస్తోంది.