YS Jagan: ఏపీలో పెన్షన్ పెంపు, వచ్చే జనవరి నుంచి అమలు - కుప్పానికి చంద్రబాబు ఏమీ చేయలేదు: జగన్
వచ్చే జనవరి నుంచి సామాజిక పెన్షన్లను 2750కి పెంచుతున్నట్లుగా జగన్ కుప్పంలో ప్రకటించారు. కుప్పం అభివృద్ధికి చంద్రబాబు ఏమీ చేయలేదని విమర్శించారు.
Ys Jagan About New Pension Amount In AP: కుప్పం అంటే చంద్రబాబు పరిపాలన కాదని.. కుప్పం అంటే ఎస్సీ, ఎస్టీ , బీసీల అభివృద్ధి అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కుప్పం నియోజకవర్గలో చేయూత పథకం నిధులను మీట నొక్కి సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికల్లో తాము పెన్షన్‌ను మూడు వేలకు పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చామని ఆ హామీని నెరవేర్చేందుకు వచ్చే జనవరిలో ప్రస్తుతం ఇస్తున్న రూ. 2500 పెన్షన్‌ను రూ. 2750 చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఏడాది మూడు వేలు చేస్తారు. డైరక్ట్ మనీ ట్రాన్స్ ఫర్ ద్వారా ఇప్పటికి ప్రజలకు లక్షా 71 వేల 244 కోట్లను పంపిణీ చేశామని జగన్ ప్రకటించారు.
39 నెలల్లోనే రూ. 51 వేల కోట్లు పంపిణీ !
మహిళల కోసం నాలుగు పథకాలకు 39 నెలల్లోనే రూ. 51 వేల కోట్లు పంపిణీ చేశామన్నారు. అప్పుడూ ఇప్పుడూ ఒకే బడ్జెట్ ఉన్నా ఈ పథకాలన్నీ ఎలా అమలు చేస్తున్నామో ప్రజలు ఆలోచించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో దోచుకో.. దాచుకో.. తినుకో అనే స్కీమ్‌ను అణలు చేసేవారని విమర్శించారు.ఇది మహిళల ప్రభుత్వమని.. జగన్ స్పష్టం చేశారు. కుప్పం ప్రజల కోసం చంద్రబాబు ఆలోచించిన పాపాన పోలేదని జగన్ విమర్శించారు. కుప్పానికి చంద్రబాబు నాన్ లోకల్.. హైదరాబాద్‌కు లోకల్ అన్నారు. కుప్పం నుంచి చంద్రబాబుకు కావాల్సింది పిండుకున్నారని.. కానీ కుప్పం కరవుకు చంద్రబాబు పరిష్కారం చూపలేదన్నారు.
కుప్పం బీసీలు పోటీ చేయాల్సిన నియోజకవర్గం !
కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు కుప్పంలో నీటి సమస్యకు పరిష్కారం చూపలేదన్నారు. హంద్రీ నీవా సమస్యకు చంద్రబాబే అడ్డంకి అన్నారు. తనకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చారని వాళ్లు పనులు చేయడం లేదని ఆరోపించారు. కుప్పం మున్సిపాలిటీలో ఒక్క డబుల్ రోడ్ కూడా వేయలేదని జగన్ విమర్శించారు. రోడ్లు వేయలేని చంద్రబాబు విమానాశ్రయం తీసుకొస్తాని ప్రజల చెవిలో పూవులు పెట్టారన్నారు. ఇంత కంటే చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటారా అని ప్రశ్నించారు. కుప్పం బీసీలు పోటీ చేయాల్సిన నియోజకవర్గమని అందుకే భరత్‌కు టిక్కెట్ ఇస్తున్నామన్నారు. కుప్పం బీసీల సీటు అయితే వారికి ఇవ్వకుండా లాక్కున్నారని జగన్ ఆరోపించారు. భరత్‌ను గెలిపించి పంపితే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఉంటూనే కుప్పానికి ఎంతో చేయించాడని ప్రశంసించారు.
ఆరు నెలల్లో హంద్రీ నీవా బ్రాంచ్ కెనాల్ పూర్తి చేస్తాం !
'
కుప్పం అభివృద్ధికి జగన్ పలు కీలక హామీైలు ఇచ్చారు. కుప్పం రైతులకు కీలకమైన హంద్రీ నీవా బ్రాంచ్ కెనాల్‌ను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు కప్పంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వాటి విలువ రూ. 66 కోట్లు. కొత్తగా నిర్మించిన ప్రభుత్వ భవనాలను ప్రారంభించారు.