Secret G.O.s Row: తెలంగాణ హైకోర్టు తీర్పుతో అందరి చూపు ఏపీ వైపు ! జీవోలన్నీ రహస్యంగా ఉంచడం సాధ్యమేనా..?
జీవోలను రహస్యంగా ఉంచడం నిబంధనలకు విరుద్దమన్న అభిప్రాయాలున్నాయి. కానీ ఏపీ సర్కార్ అదే పని చేయాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు జీవోలను 24 గంటల్లో వెబ్‌సైట్‌లో ఉంచాలని అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించింది
ప్రభుత్వ ఉత్తర్వులను 24 గంటల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించింది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని జీవోలను రహస్యంగా ఉంచడం లేదు.. కొన్ని జీవోలను మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదు. కానీ పొరుగున ఏపీ ప్రభుత్వం మాత్రం పూర్తిగా జీవోల విషయంలో ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. అసలు ప్రభుత్వ ఉత్తర్వులేవీ ప్రజలకు అందుబాటులో ఉంచవద్దన అధికారిక నిర్ణయం తీసుంది. జీవోలు పెట్టాల్సిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్స్ ఉండకూడదని స్పష్టం చేసింది. మాన్యువల్ పద్దతిలో అందరూ రిజిస్టర్లు రెడీ చేసుకోవాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు తరహాలో ఎవరైనా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేస్తే పరిస్థితి ఏంటి..? జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచారని న్యాయస్థానాలు ఆదేశిస్తాయా..? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి...?
జీవోలను దాచకూడదంటున్న కేంద్రం, న్యాయస్థానాలు !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాలు, జారీ చేసే ఉత్తర్వులు అన్నీ రహస్యంగా ఉంచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ నిర్ణయాలు అన్నీ గవర్నమెంట్ ఆర్డర్స్.. జీవోల రూపంలో https://goir.ap.gov.in/ పోర్టల్‌లో జీ ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. మంగళవారం ఈ పోర్టల్‌లో ఒక్క జీవో కూడా అప్‌లోడ్ చేయలేదు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4 (1) (సి) ప్రకారం ప్రభుత్వం ప్రతి సమాచారాన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. 2005లో సమాచార హక్కుచట్టం అమలులోకి వచ్చాక పాలనలో పారదర్శకత పెరిగింది. 2007లో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మోహన్‌కందా మరో అడుగు ముందుకేసి... ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని కోరారు. వైఎస్ కూడా అందుకు అంగీకరించారు. అప్పుడే జీవోఐఆర్ అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇక అప్పటి నుంచి ప్రభుత్వం జారీ చేసే జీవోలను జీవోఐఆర్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ అందుబాటులో ఉంటూండటంతో అందరికీ ఉపయోగకరంగా ఉండేది. అయితే అన్ని జీవోలు ప్రజలకు తెలిసిపోవడం నచ్చని ఏపీ ప్రభుత్వం రహస్య జీవోలకు సిద్ధమయింది.
ప్రభుత్వాల నిర్ణయాలు ప్రజలకు తెలియాలనే నిబంధనలు..!
జీవోలను ప్రభుత్వాలు రహస్యంగా ఉంచవద్దని ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేంద్రం కూడా పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ప్రతి జీవో ప్రజలకు సంబంధించినదని... ప్రజా పాలనకు సంబంధించినదని ప్రజలు చెల్లించిన పన్నుల నిధులను వ్యయం చేసేదని అటువంటి బహిరంగంగా ఉండవలసిన జీవోలను దాచిపెట్టకూడదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. దేశ భద్రత లేదా ఎవరైనా వ్యక్తిగత గోప్యతకి సంబంధించిన విషయాల్లో మినహా ప్రతీ విషయం ప్రజలకు తెలియాలని పలు మార్లు న్యాయస్థానాలు ఆదేశించాయి. మూడేళ్ల కిందట తెలంగాణలో పేరాల శేఖర్ అనే వ్యక్తి రహస్య జీవోలపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో హైకోర్టు కూడా రహస్య జీవోలు చెల్లవని, వాటిని ప్రజలకు తెలుసుకునే హక్కు వుందని, వాటిని తెలిసేలా వుంచాలని సూచించింది. కానీ ఆదేశాలు అమలు కాలేదు. మరోసారి తెలంగాణ హైకోర్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వాలు మాత్రం రాజకీయంగా వివాదం అవుతాయనున్న వాటిని రహస్యంగా ఉంచుతున్నాయి.
జీవోలు వివాదాస్పదమవుతున్నాయని సీక్రెట్‌గా ఉంచాలని ఏపీ సర్కార్ నిర్ణయం..!
ప్రభుత్వాలు కాన్ఫిడెన్షియల్ జీవోలను తీసుకు రావడం సహజమే. సీక్రెట్‌గా చేయాలనుకున్న పనుల్ని.. ప్రజల నుంచి విమర్శలు వస్తాయనుకున్న పనుల్ని కాన్ఫిడెన్షియల్ జీవోల పేరుతో చేసేస్తారు. కానీ ఏపీ ప్రభుత్వం ఇటీవల బ్లాంక్ జీవోల విధానం తీసుకు వచ్చింది. బ్లాంక్ జీవోల్లో ఏ శాఖ నుంచి రిలీజ్ అయ్యాయో తెలుస్తుంది. జీవో నెంబర్ కూడా ఉంటుంది. కానీ అది అసలు దేనికి సంబంధించినది.. అనే వివరాలు మాత్రం ఇందులో ఉండవు. అసలు జీవో కాపీనే ఉండదు. కాన్ఫిడెన్షియల్ జీవోలను తర్వాత బహిరంగ పరిచేవారు. ఇప్పుడు బ్లాంక్ జీవోలతో అలా బయట పెట్టే పరిస్థితి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలు ఇటీవలి కాలంలో వివాదాస్పదం అవుతున్నాయి. కొన్ని నిర్ణయాలపై విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని బ్లాంక్ జీవోలను ఇటీవల విడుదల చేశారు. వీటిపై టీడీపీ నేతలు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. గతంలో కొన్నికీలక నిర్ణయాలను కాన్ఫిడెన్షియల్ జీవోలుగా జారీ చేసి.. నిర్ణయాలను అమలు చేసిన తర్వాత పబ్లిక్ డొమైన్‌లో ఉంచేవారు. ఇక కోర్టు వివాదాల్లో ఇరుక్కున్న జీవోల సంగతి చెప్పాల్సిన పని లేదు. కీలకమైన జీవోల్లో అనేక నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు కొట్టి వేసింది. ఇలాంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అసలు జీవోల్ని రహస్యంగా ఉంచాలన్న నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చినట్లుగా కనిపిస్తోంది.
విపక్షంలో ఉండగా రహస్య జీవోలపై విరుచుకుపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..!
నిజానికి రహస్య జీవోల విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా కాన్ఫిడెన్షియల్ జీవోలను విడుదల చేసేది. నిర్ణయాలను అమలు చేసిన తర్వాత ఎప్పటికో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేవారు. ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని ప్రతిపక్ష నేతగా జగన్‌తో పాటు వైసీపీ నేతలందరూ విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కాన్ఫిడెన్షియల్ అనే పద్దతి నుంచి బ్లాంక్ జీవోలు.. ఆ తర్వాత మొత్తం పాలననే సీక్రెట్‌గా ఉంచేలా జీవోలన్నీ ఆఫ్‌లైన్‌కి చేర్చాలని నిర్ణయించడం విమర్శలకు కారణం అవుతోంది.
ఏపీ సర్కార్ నిర్ణయంపై ఎవరైనా కోర్టుకెళ్తే ఏమవుతుంది ?
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి ఎవరో ఒకరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఖచ్చితంగా పిటిషన్ వేస్తారు. అప్పుడు ప్రభుత్వ నిర్ణయానికి ఎదురు దెబ్బ తగలక మానదని.. జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయమే వస్తుందని న్యాయనిపుణులు అంటున్నారు. ఆంధ్రప్రేదశ్‌లో ఆఫ్ లైన్ జీవోల విషయంలో ముందు ముందు న్యాయపరంగా కూడా కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటామని తెలంగాణ హైకోర్టు తీర్పు ద్వారా అంచనా వేయవచ్చు.