TDP Vs YSRCP : ఏపీలో డ్రగ్స్, కేసినోపై రాజ్యసభలో ప్రస్తావన , కనకమేడల ప్రసంగాన్ని అడ్డుకున్న వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు !
రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కనకమేడల ప్రసంగాన్ని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు అడ్డుకున్నారు.
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ అధికార , ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం రాజ్యసభలో మాట్లాడిన టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో మైనింగ్, ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. రాష్ట్రం డ్రగ్స్ హబ్ గా మారిందని ... కక్షపూరిత రాజకీయాలతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో ఘటనను కూడా ప్రస్తావించారు. పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం అసాంఘిక చర్యలతో పబ్బం గడుపుతోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు దాడులు చేశారని రాజ్యసభ దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలసత్వంతోనే పోలవరం ఆలస్యమవుతోందన్నారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని జగన్ ప్రభుత్వం చెడగొట్టిందని, రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రాకపోగా పరిశ్రమల స్థాపనకు ముందకు వచ్చిన వారు కూడా పక్క రాష్ట్రాలకి తరలిపోయారంటూ ఎంపీ కనకమేడల మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనంతో చివరకి సినిమా టిక్కెట్ల వ్యవహారంలోనూ తలదూర్చిందని తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి అమరావతిని ఏపీ రాజధానిగా ఒప్పుకుని.. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులకు తెరలేపారని.. ఇప్పుడు అసలు రాజధాని ఎక్కడో తేల్చకుండానే.. ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు.
అయితే రవీంద్ర కుమార్ మాట్లాడుతుండగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడ్డుకున్నారు. దీనిపై స్పందించిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్.. రవీంద్ర కుమార్ ప్రసంగాన్ని అడ్డుకోవద్దని విజయసాయిరెడ్డిని వారించారు. అయినా వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పాలన కన్నా వైఎస్ఆర్‌సీపీ పాలన వెయ్యి రెట్లు మెరుగ్గా ఉందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ప్రకటించారు. వైఎస్ఆర్‌సీపీ సభ్యుల నినాదాల మధ్యనే కనకమేడల ప్రసంగం కొనసాగించారు. అయితే ఇచ్చిన సమయం ముగిసిపోయినా ప్రసంగం కొనసాగిస్తూండటంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ మైక్ కట్ చేశారు.
రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఒక్క ఎంపీనే ఉన్నారు. టీడీపీ తరపున గెలిచిన ఇతర సభ్యులు రెండున్నరేళ్ల క్రితమే భారతీయ జనతా పార్టీలో చేరారు. టీడీపీ తరపున మాట్లాడే అవకాశం ఒక్క కనకమేడల రవీంద్రకుమార్‌కు మాత్రమే వస్తోంది. ఈ సమయాన్ని టీడీపీ ఎంపీ ఎపీలోని పరిస్థితులను రాజ్యసభ దృష్టికి తీసుకు రావడానికి వెచ్చిస్తున్నారు.