Chandrababu : ఖబడ్దార్, దాడులు రిపీట్ అయితే ఎవరినీ వదిలిపెట్టం- చంద్రబాబు
Chandrababu : హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత చెన్నుపాటి గాంధీని చంద్రబాబు పరామర్శించారు. దాడికి పాల్పడిన దోషులను ఎట్టిపరిస్థితితో వదిలిపెట్టమని హెచ్చరించారు.
Chandrababu : టీడీపీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. శనివారం విజయవాడలో వైసీపీ నేతల దాడిలో చెన్నుపాటి గాంధీ కంటికి తీవ్ర గాయమైంది. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెన్నుపాటి గాంధీని చంద్రబాబు సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓటమి భయంతో దాడులు
వైసీపీ నేతలు ఓటమి భయంతో టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఖబడ్దార్ ఇలాంటి ఘటన రిపీట్ అయితే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కన్నుపొడవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితులకు శిక్షపడే వరకు న్యాయపరంగా పోరాడతామన్నారు. విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడి చేశారని, ఆరోజే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తు్న్నారన్నారు. ఇలాంటి పరిస్థితే మీ కుటుంబాలకు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబు అన్నారు.
హత్యారాజకీయాలు
టీడీపీ కార్యకర్తలకు సొంత అజెండాలు ఏంలేవని, ప్రజాసమస్యలపై పోరాడున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం వస్తుందని, తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. దాడులకు పాల్పిన వారిని పతనావస్థకు తీసుకెళ్లిన పార్టీ టీడీపీ అని గుర్తుచేశారు. చెన్నుపాటి గాంధీపై దాడి క్షణికావేశంలో జరిగిందని పోలీసులు చెప్పడం ఏంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. హత్యారాజకీయాలకు పాల్పడితే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.
క్షణికావేశంలో దాడి
విజయవాడలో టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడి వెనుక వైసీపీ గంజాయి మాఫియా హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. పక్కా ప్లాన్ తో చెన్నుపాటి గాంధీపై దాడి చేశారన్నారు. ఈ ఘటనపై స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా క్షణికావేశంలో దాడి జరిగినట్లు తెలిపారు. ఒకరికొకరు ఎదురుపడి, క్షణికావేశంతో కొట్టుకున్నారన్నారు. ప్రత్యర్థులు పిడికిలితో కొడితే, చెన్నుపాటి గాంధీ కన్నుకి గాయం అయ్యిందన్నారు.
వైసీపీ నేతలు దాడి!
చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తుంది. చేతితో బలంగా గుద్దడంతో ఆయన కుడి కన్నును కోల్పోయారని వైద్యులు తెలిపారు. పటమటలంకలో ఉంటున్న చెన్నపాటి గాంధీ శనివారం సాయంత్రం స్థానిక జిల్లాపరిషత్ పాఠశాలకు సమీపంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు బయలుదేరారు. పాఠశాల వద్ద డ్రైనేజీ పనులను పరిశీలించి, స్కూటర్‌పై వెళ్లిపోతుండగా వైసీపీ నేతలు గద్దె కల్యాణ, సుబ్బు చెన్నుపాటి గాంధీని పిలిచారు. డ్రైనేజీ సమస్యపై తాము మాట్లాడుకోలేమా అంటూ గాంధీపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో చెన్నుపాటి గాంధీకి కంటికి తీవ్రగాయం అయింది.
Also Read : Chandrababu : టీడీపీ వాళ్ల తలలు పగలగొడితే శాంతిభద్రతలు బాగున్నట్లేనా?, డీజీపీకి చంద్రబాబు లేఖ
Also Read : TDP Chennupati Gandhi : టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై దాడి, వైసీపీ నేతలే దాడి చేశారని ఆరోపణ