Cases On Chandrababu: జగన్ చెప్పినట్లుగా చంద్రబాబుపై 24 కేసులున్నాయా ? ఇదిగో అసలు నిజం
CBN: చంద్రబాబుపై ఎన్ని కేసులు ఉన్నాయి ? జగన్ చెప్పిన 24 కేసుల్లో నిజం ఎంత ?

How many cases are there against Chandrababu Naidu : చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని ఆయనను నడిరోడ్డుపై కొట్టవచ్చా అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెనాలిలో అన్నారు. చాలా మంది నిజంగా చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులు ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు. ఈ విషయంలో చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆరు కేసులు ఎక్కువగా చెప్పినట్లుగా స్పష్టమవుతోంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చంద్రబాబుపై 19 కేసులు ఉన్నాయి. కానీ జగన్ ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పారు.
గత ఏడాదిలో చంద్రబాబుపై ఉన్న కేసుల్లో రెండు మాఫీ
అదే సమయంలో ఈ ఎన్నికల అఫిడవిట్ ఎడాది కిందటిది. ఈ ఏడాదిలో చంద్రబాబుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ లో నమోదైన కేసును కొట్టివేశారు. గతంలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు నిరసన చేపట్టడంతో ఆ కేసు నమోదు అయింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఆ కేసును కొట్టివేశారు. అలాగే అంగళ్లులో చంద్రబాబుపై జరిగిన హత్యాయత్నం , రాళ్ల దాడిలో ఘటనలో చంద్రబాబుబపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. అందులో ఆధారాల్లేవని పోలీసులు కేసులు మూసేశారు. అంటే రెండు కేసులు తగ్గాయి. ప్రస్తుతం పదిహేడు కేసులు మాత్రమే ఉన్నాయి.
జగన్ సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబుపై కేసులు నమోదు
ఈ పదిహేడు కేసులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నమోదయ్యాయి. లిక్కర్ స్కాం, స్కిల్ స్కాం అంటూ పలు స్కాముల్లో కేసులు నమోదు చేశారు. సీఐడీ పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. అలాగే కొన్ని చోట్ల రాజకీయ ఆందోళనల్లో పాల్గొన్న కేసులు ఉన్నాయి. కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని కూడా కేసులు నమోదు చేశారు. నర్సరావుపేటలో విపత్తుల నిర్వహణ కింద కూడా కేసులు పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో కనీస ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. జగన్ మోహన్ రెడ్డిపై ఎన్ని కేసులు ఉన్నాయో.. చంద్రబాబుపై కూడా అన్ని కేసులు పెట్టాలని అనుకున్నారని ఆరోపిస్తూ ఉంటారు.
జగన్ కేసుల ప్రచారంపై టీడీపీ ఆగ్రహం
కొత్త అసెంబ్లీ ఏర్పాటయిన తరవాత తొలి అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబునాయుడు.. ఎవరెవరిపై ఎన్నెన్ని కేసులు ఐదు సంవత్సరాల్లో పెట్టారో లేచి నిలబడాలని పిలుపునిచ్చారు. కూటమి తరపున ఎన్నికైన 164 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 150 మందిపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సలహా అందరిపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. కక్ష పూరితంగా పెట్టిన కేసులుకు, జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసిన కేసులకు పొంతన ఎక్కడ ఉంటుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేసి.. కేసుల గురించి జగన్ మాట్లాడుతున్నారని అంటున్నారు. మొత్తంగా ఎలాంటి కేసులన్నది పక్కన పెడితే చంద్రబాబుపై ప్రస్తుతం పదిహేడు కేసులు ఉన్నాయని అనుకోవచ్చు. సీఐడీ కేసులు కాకుండా ఇతర కేసులన్నీ పెట్టీ కేసులే.





















