Rains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ - రెండు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు
Weather Report: అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Heavy Rains In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏపీలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న వాయుగుండం ఒడిశాలోని చిలికా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని పూరీ తీరానికి నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్ పూర్‌కు ఈశాన్యంగా 70 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్పారు. ఇది వాయువ్యం దిశగా కదులుతూ.. ఒడిశా - ఛత్తీస్ గఢ్ భూభాగాలపైకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ప్రభావంతో ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, నంద్యాల, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు.
ఏపీ, ఒడిశా మధ్య నిలిచిన రాకపోకలు
భారీ వర్షాలతో ఏపీలో వాగులు, వంకల్లో వరద ఉద్ధృతి సాగుతోంది. గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. గోదారి ఉప నది శబరికి వరదతో అల్లూరి జిల్లాలోని చింతూరు - కల్లేరు గ్రామాల మధ్య గండి పడి 316వ జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో ఆ మార్గంలో ఏపీ - ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు, వర్షాలు, వరదలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం ఆదేశాలతో కలెక్టర్లు, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తుపాను తీరం దాటే వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
అనకాపల్లి జిల్లాలో కల్యాణపులోవ జలాశయం నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. తాండవ జలాశయం నీటిమట్టం సైతం పెరిగింది. తాడిగిరి వంతెన పైనుంచి వరద ప్రవహిస్తుండగా.. 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు, శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, కృష్ణా, అల్లూరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రామరాజుపాలెం వద్ద వంతెనపై వరద ప్రవహిస్తుండగా కేడీపేట - చింతపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, ఎగువన భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. బ్యారేజీ నుంచి కాల్వల ద్వారా 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అటు, పులిచింతల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. నీరు వంద అడుగులకు చేరింది. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 12 వేల హెక్టార్లకు పైగా వరినాట్లు నీట మునిగాయి.
తెలంగాణలోనూ భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకూ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకూ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కాగా, గడిచిన 24 గంటల్లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కొత్తగూడెం, భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురవగా.. ములుగు జిల్లా వెంకటాపురంలో అత్యధికంగా 10 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదైంది. అటు, కొన్ని ప్రాంతాల్లో వర్షాల పట్ల దండోరాతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.