Gangavaram Port Row : గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాల అమ్మకంపై వివాదం ! విపక్షాల ఆరోపణలేంటి ? ప్రభుత్వ వాదన ఏంటి..?
గంగవరం పోర్టు చుట్టూ ఎప్పుడూ వివాదాలే. పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకించిన మత్స్యకారులపై కాల్పులు జరిగినా.. ఇప్పుడు మొత్తం అదాని గ్రూప్‌కు అప్పగించినా అవే వివాదాలు. అసలు ఏ టు జడ్ ఏం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంగవరం పోర్టులో తమకు ఉన్న 10.4 శాతం వాటాను అదానీ పోర్ట్స్ సంస్థకు అమ్మేసింది. ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు అదానీ గ్రూప్ అధికారికంగా తెలియచేసిన తర్వాతనే బయట ప్రపంచానికి తెలిసింది. ఇంతకు ముందు అదానీ పోర్ట్స్ ఏపీ ప్రభుత్వ వద్ద ఉన్న 10.4శాతం వాటా మినహా మిగతా ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్నవాటాలను కొనుగోలు చేసింది. ప్రభుత్వం కూడా తన వాటాలు ఇచ్చేయడంతో వందశాతం అదానీ పోర్టుగా గంగవరం పోర్టు మారిపోయింది. అయితే ఇదంతా పెద్ద స్కాం అని ఆంధ్రప్రదేశ్ విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. రక్షణ పరంగా అత్యంత కీలకమైనదని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం సరి కాదని కొంత మంది నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు గంగవరం పోర్టు ఎవరిది..? ఎలా అదానీ చేతుల్లోకి వెళ్లింది..? రాష్ట్ర ప్రభుత్వ వాటాల అమ్మేయడం వల్ల లాభమా..? నష్టమా..?
గంగవరం పోర్టు ప్రతిపాదన నుంచి వివాదాలే..!
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పక్కనే గంగవరం పోర్టు ఉంది. సహజ సిద్ధమైన గంగవరం పోర్టు లోతు అత్యధికం 21 మీటర్లు. అందువల్లే నేడు రెండు లక్షల టన్నుల సామర్ధ్యం కల్గిన పనామా షిప్‌లు ఇక్కడకు రాగలుగుతున్నాయి. అన్ని రకాలైన ఇనుము, బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్, ముడి పంచదార, అల్యూమినా వంటి అత్యంత విలువైన సరుకుల ఎగుమతి, దిగుమతులకు సులభతరమైంది. ఈ పోర్టు ప్రతిపాదన నుంచి నిర్మాణం వరకూ ఏదీ తేలికగా సాగలేదు. 1994లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోర్టు విషయంలో కదలిక వచ్చింది. అక్కడ పోర్టు నిర్మించాలంటే కేంద్రం అనుమతితీసుకోవాలి. కేంద్ర స్టీల్, నౌకాయాన, రక్షణ మంత్రిత్వ శాఖలు తీవ్రంగా వ్యతిరేకించాయి. చివరికి 2002లో కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ భూసేకరణ కష్టమయింది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్మించడం కానీ స్టీల్ ప్లాంట్ కూడా నిర్మించి ఆపరేట్ చేయడం సాధ్యం కాదని ప్రైవేటు రంగంలో నిర్మించాలని నిర్ణయించారు. 2004లో టీడీపీ ప్రభుత్వం పడిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమమంత్రి అయ్యారు. టీడీపీ హయాంలో అనుమతులు వచ్చినా వైఎస్ ప్రభుత్వం మోకాలడ్డలేదు. గంగవరం పోర్టు నిర్మాణ అనుమతులు వచ్చేలా సహకరించింది. అయితే గంగవరం ప్రయివేటు పోర్టు నిర్మాణాన్ని స్థానిక ప్రజలు, మత్స్యకారులు వ్యతిరేకించారు. గంగవరం, దిబ్బపాలెం పరిసరాల్లోని మత్స్యకారులు భూమిని ఇవ్వడానికి అంగీకరించలేదు. 2006లోరాష్ట్ర ప్రభుత్వం భారీగా బలగాలను దించి... కాల్పులు జరిపి మరీ భూసేకరణ పూర్తి చేసింది. ఆర్నెల్లు పోర్టు నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకున్నారు. 2006 మార్చి 27న తెల్లవారు జామున గంగవరం గ్రామాల్లో కాల్పులు కూడా జరిగాయి. చోడిపల్లి నూకరాజు అనే మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తరవాత 2007లో పోర్టుకు భూములు అప్పగించారు.
ప్రభుత్వ వాటా కింద ఇచ్చింది స్టీల్ ప్లాంట్ భూములే.. !
స్టీల్‌ప్లాంట్ నుంచి తీసుకున్న 1800 ఎకరాల బదులు, రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటాలు అప్పజెప్పింది. 1800 ఎకరాల భూములు స్టీల్‌ప్లాంట్‌వి కాగా, వాటాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. బీవోవోటీ అంటే.. బిల్డ్ ...ఆపరేట్.. ట్రాన్స్ ఫర్ పద్దతిలో ఒప్పందం కుదిరింది. గంగవరం పోర్టును నిర్మించి 30 ఏళ్లపాటు నిర్వహించుకుని ప్రభుత్వానికి అప్పగించేయాలి. అంటే 30 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి వస్తుంది. ఇప్పుడు ఉన్న వాటాను అమ్మేయడం వల్ల ఆ పోర్టు 30 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి వస్తుందా రాదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోతుంది. గంగవరం పోర్టుకు జాయింట్ వెంచర్ గా చెబుతూంటారు. రక్షణపరంగా వ్యూహాత్మక తీరంలో ప్రైవేటు పోర్టు పెట్టడం కుదరదని మొదట కేంద్రం అభ్యంతరం చెప్పింది. సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గంగవరం పోర్టులో ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని పత్రాలు ఇచ్చిన తర్వాతే 2002లో కేంద్రం పోర్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.
లాభదాయక పోర్టు గంగవరం..!
గంగవరం పోర్టు సామర్థ్యం 64 మిలియన్ మెట్రిక్ టన్నులు. 2019-20లో 34.5 ఎంఎంటీ కార్గోను పోర్టు హ్యాండిల్ చేసింది. 2 లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం కలిగిన నౌకలు సైతం పోర్టులో రాకపోకలు సాగించే వీలుంది. 9 బెర్తులతో కార్యకలాపాలు సాగిస్తోంది. కోల్, ముడిఇనుము, ఎరువులు, లైమ్‌స్టోన్, స్టీల్ తదితర పలు కమోడిటీలను హ్యాండిల్ చేయగల సౌకర్యాలను కలిగి ఉంది. గతేడాది గంగవరం పోర్ట్ రూ. 1082 కోట్ల ఆదాయాన్ని సాధించింది. రూ. 516 కోట్ల నికర లాభం ఆర్జించింది. పోర్ట్ కు ఎలాంటి రుణాలు లేవు. అంతే కాదు రూ. 500 కోట్ల నగదు నిల్వలు కలిగి బలమైన ఆర్థిక స్థితిలో ఉంది.
అందరి దగ్గరా వాటాలు కొనేసిన అదానీ గ్రూప్..!
గంగవరం పోర్టులో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి 89.6 శాతం వాటా ఉండేది. దీనిని అదానీ సంస్థ రూ.3,604 కోట్లకు సొంతం చేసుకుంది. గంగవరం పోర్టు లో పెయిడప్ కేపిటల్ కింద 51.7 కోట్ల షేర్లు ఉన్నాయి. అందులో డీవీఎస్ రాజుకు 30 కోట్ల షేర్లు ఉండేవి. ఒక్కో షేరుకు రూ.120 చొప్పున వెలకట్టి... అదానీ వాటిని సొంతం చేసుకుంది. ఇదే పోర్టులో 31.5 శాతం వాటా ఉన్న దుబాయ్ కంపెనీ కూడా రూ.1,954 కోట్లకు తన వాటా విక్రయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ 2021 జూన్ 8న గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాలు 10.4 శాతం అదానీ గ్రూపుకు రూ. 645 కోట్లకు అమ్మాలని నిర్ణయించింది. ఈ పోర్టును స్పెషల్ ఎకనామిక్ జోన్‌గా మార్చడానికి కూడా అనుమతించింది.
అదానీ సంస్థల్లోకి పెట్టుబడులపై కొనసాగుతున్న విచారణ..!
ఇటీవల అదానీ గ్రూప్‌లోకి వస్తున్న పెట్టుబడుల వెల్లువపై సెబీ విచారణ చేపట్టింది. సాధారణంగా విదేశీ నిధులు వచ్చినప్పుడు.. అవి ఏ కంపెనీల నుంచి వచ్చాయి?ఆయా కంపెనీలకు నిధులకు వనరులెక్కడ నుంచి వచ్చాయి? తదితర వివరాలను సెబీకి, ఇతర సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే.. అదానీ గ్రూప్ అలాంటి వివరాలు సమర్పించలేదని అంటున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లుగా సెబీ కూడా ప్రకటించింది. ఈ ఆరోపణలతో ఇటీవల పెద్ద ఎత్తున ఆ గ్రూప్ షేర్ల విలువ పడిపోయింది. ఇది కూడా గంగవరం పోర్టుఅమ్మకంపై వివాదం కావడానికి కారణమయ్యే అవకాశం ఉంది.
విపక్షాల అభ్యంతరాలేంటి..? ప్రభుత్వం ఏమంటోంది..?
అసలు ఇప్పటికిప్పుడు గంగవరం పోర్టులో ఉన్న వాటాలను అమ్మాల్సిన అవసరం ఏమిటని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. భారీగా లాభాలు వస్తున్న పోర్టు.. పెట్టిన పెట్టుబడి కన్నా ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్న పోర్టు.. అదీకూడా కొన్నాళ్ల తర్వాత వంద శాతం ప్రభుత్వ పరమయ్యే ప్రాజెక్టులోవాటాలు అమ్మాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అదానీ గ్రూప్‌తో ఒప్పందం వెనుక గూడు పుఠాణీ ఉందంటున్నారు. ఇప్పుడు కాకపోతే తర్వాత ప్రభుత్వం మారితే స్కాం అంతా బయటకు తీస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతిపక్షాల విమర్శలను ప్రభుత్వం కొట్టి పారేస్తోంది. గంగవరం పోర్టులో వాటాలను అమ్మి ఆ సొమ్ముతో మరికొన్ని పోర్టులను అభివృద్ధి చేస్తామని ఏపీ మారిటైమ్ బోర్డు చెబుతోంది.