Praveen Prakash public apology: మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం - - ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్‌లకు బహిరంగ క్షమాపణ - అసలేం జరిగిందంటే ?
Former IAS Praveen Prakash: ఏబీ వెంకటేశ్వరరావు , జాస్తి కృష్ణకిషోర్‌లకు మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ క్షమాపణలు చెప్పారు. జగన్ హయాంలో వారిని వేధించారని.. వారికి న్యాయం చేయలేకపోయానన్నారు.

Former IAS Praveen Prakash apologizes to AB Venkateswara Rao and Jasti Krishnakishore: మాజీ IAS అధికారి ప్రవీణ్ ప్రకాష్ జగన్ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై మాజీ DG ఏబీ వెంకటేశ్వరరావు , మాజీ IRS అధికారి జాస్తి కృష్ణకిషోర్‌లకు పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాలంటరీ రిటైర్‌మెంట్ (VRS) తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్, తన తప్పులను ఒప్పుకుంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశారు.
ఆత్మ పరిశీలనలో తప్పొప్పులు గుర్తించా !
నేను 30 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధం కలిగి ఉన్నాను. ఒక్క రూపాయి కూడా అవినీతి ద్వారా సంపాదించలేదు. ఎప్పుడూ చట్ట విరుద్ధంగా ఫైల్‌లలో నోటింగ్ చేయలేదు, అనుమతి ఇవ్వలేదు. నా జూనియర్లకు కూడా అలాంటి సూచనలు చేయలేదు అని అన్నారు. గత ఏడాది జూన్-జూలైలో విజయవాడలో ఉండగా సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురికావడంతో మానసికంగా కుంగిపోయానని, అది VRS తీసుకోవడానికి కారణమైందని వెల్లడించారు. అక్టోబర్‌లో ఢిల్లీకి వచ్చిన తర్వాత ఏడాది పాటు ఆత్మపరిశీలన చేశానని, తన తప్పులను గుర్తించానని చెప్పారు.
2000-2004 మధ్య గుంటూరు, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ప్రజల నుంచి ఎంతో ప్రేమ, ఆదరణ, హీరో వర్షిప్ లభించిందని ప్రవీణ్ ప్రకాష్ గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, లండన్, న్యూయార్క్, వాషింగ్టన్, కెనడాలలో కూడా గుంటూరు-విజయవాడ ప్రజలు నన్ను గుర్తుపట్టి ఆప్యాయంగా మాట్లాడేవారు. అది నాకు ఆక్సిజన్ లాంటిది, పని చేయడానికి ప్రేరణ అని అన్నారు. అయితే, సడెన్‌గా ఆ ఆదరణ ట్రోలింగ్‌గా మారడం తనలో మానసిక ఆందోళన కలిగించిందని, ఆత్మపరిశీలనలో సమాజం తనపై పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టు వ్యవహరించలేకపోయానని గ్రహించానని చెప్పారు.
ముఖ్యంగా 2020లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD) ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు వచ్చిన ఒక ఫైల్ గురించి ప్రవీణ్ ప్రకాష్ వివరించారు. DGP కార్యాలయం నుంచి వచ్చిన ఆ ఫైల్‌లో అడిషనల్ DGP ఏబీ వెంకటేశ్వరరావు (1989 బ్యాచ్ IPS)పై డిసిప్లినరీ యాక్షన్ సిఫార్సు చేసిన అంశానికి సంబంధఇంచినది. "చార్జెస్ ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్‌కు విరుద్ధంగా కనిపించాయి. కానీ ప్రాక్టీస్‌లో అలాంటివి ఆమోదయోగ్యమే. ఉదాహరణకు, గవర్నమెంట్ వాహనాన్ని ప్రైవేట్ పనికి ఉపయోగించినప్పుడు చెల్లింపు చేయాలని రూల్ ఉంది. కానీ 30 ఏళ్ల కెరీర్‌లో ఎవరూ అలా చేయరు, అది సాధారణమే" అని వివరించారు.
అయితే, ఆ ఫైల్‌ను చట్టపరమైన దృక్కోణం నుంచి మాత్రమే పరిశీలించి, యాక్షన్ సిఫార్సు చేశానని, ఇప్పుడు అది తప్పని గ్రహించానని ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. "ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న నాకు సమాజం ఎక్స్‌పెక్టేషన్ ఎథిక్స్, మొరాలిటీ లెన్స్‌తో ఫైల్‌లు పరిశీలించాలి. రోల్ రివర్సల్ టెస్ట్ అప్లై చేస్తే – ఆ చార్జెస్ నాపై ఉంటే న్యాయమా? – అని ఆలోచిస్తే, ఆ ప్రతిపాదనను తిరస్కరించాల్సింది" అని చెప్పారు. ఇలాంటి పరిస్థితే జాస్తి కృష్ణకిషోర్ (మాజీ APEDB CEO) కేసులో కూడా జరిగిందని, ఆ ఇద్దరికీ తన నిర్ణయాల వల్ల మానసిక, సామాజిక బాధలు కలిగాయని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
"ఏబీ వెంకటేశ్వరరావు , కృష్ణకిషోర్ లకు ఫోన్ చేసి సారీ చెప్పాను. కానీ మనిషి సామాజిక జీవి కాబట్టి, పబ్లిక్‌గా కూడా క్షమాపణలు చెబుతున్నాను. మీరు మీ మనసులో నన్ను క్షమించండి" అని భావోద్వేగంగా అన్నారు. ఢిల్లీలోని స్నేహితులు ఈ అపాలజీపై ప్రశ్నించగా, "ఇది నా స్వార్థపరమైన చర్య కాదు. వారి బాధలను తిరిగి తీసుకురాలేను, కానీ నా మనసు శుభ్రం చేసుకోవాలి. భవిష్యత్తులో నా కెరీర్ 2.0లో ఎథిక్స్, మొరాలిటీ లెన్స్‌తోనే నిర్ణయాలు తీసుకుంటాను" అని సమాధానమిచ్చారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ.
— 𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀 (@Trends4TDP) November 12, 2025
ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్‌కు సారీ చెప్పిన ప్రవీణ్ ప్రకాష్.
తప్పు చేశాననే భావనతో VRSకు అప్లయ్ చేశా.. 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పని చేశా.. నా సర్వీస్‌లో ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదు.#AndhraPradesh pic.twitter.com/afKW8C6ikt





















