PM Kisan Andhra : గురువారం రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధుల జమ - కానీ ఏపీలో 5 లక్షల మందికి బ్యాడ్ లక్ ...
పీఎం కిసాన్ సాయానికి ఏపీలో ఐదు లక్షల మంది రైతులు దూరమవుతున్నారు. ఈ కేవైసీ చేయించుకోలేకపోవడమే కారణం.
PM Kisan Andhra : రైతులకు పెట్టుబడి సాయం అందించే కేంద్ర పథకం 'పిఎం కిసాన్'లో భాగంగా రూ. రెండు వేలను రైతుల ఖాతాల్లో గురువారం జమ చేయనుంది. ఈ సారి ఈ కేవైసీ తప్పనిసరిచేయండతో ఏపీలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ -కెవైసి చేయించని కారణంగా 5.34 లక్షల మంది పిఎం కిసాన్ సాయానికి దూరమవుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రైతులకు కేంద్రం ఇచ్చే రూ.2 వేల సాయం అందకుండా పోతోంది. ఏడాదిలో మూడు సార్లు లో మొత్తం రూ.ఆరు వేలను 'పిఎం కిసాన్' పేరిట నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు కేంద్రం నగదు బదిలీ చేస్తోంది.
స్వంత భూమి కలిగిన వారికే ఈ సాయం అందిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జులై మొదటి విడత గురువారం జమ చేయనున్నారు. ఏపీలో మొత్తం 45,41,177 మంది రైతులు పథకానికి ఎంపికయ్యారు. తప్పనిసరిగా ఈ-కెవైసి చేయించుకుంటేనే వీరికి పిఎం కిసాన్ నిధులు జమ అవుతాయని కేంద్రం షరతు పెట్టింది. జులై నెలాఖరు సమీపిస్తున్నా ఈ-కెవైసి పూర్తి కాలేదు. 40,06,553 మందికి అంటే 88 శాతం మాత్రమే ఈ-కెవైసి జరిగినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇంకా 5 లక్షల మందికిపైగా ఈ-కెవైసి పూర్తి కాలేదు. ఈ కేవైసీ చేయించుకోవడానికి సమస్యలు ఏర్పడటంతో వారంతా నష్టపోతున్నారు.
2019లో మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పట్లో ఏపీ నుంచి 60,80,161 మంది రైతులు పిఎం కిసాన్ సాయానికి అర్హులుగా ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వారు భారీగా తగ్గిపోయి.. 46,62,768 కి చేరారు. వివిధ కారణాలతో 14 లక్షల మందికి సాయం అందడం లేదు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జులై కి 40 లక్షలకే లబ్దిదాల ంసఖ్య తగ్గిపోయిందని ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇ-కెవైసి పెండింగ్ వలన 5.34 లక్షలు, ఇతరత్రా కారణాల వలన 15 లక్షలు వెరసి అర్హులైన రైతుల్లో 20 లక్షల మందికి పిఎం కిసాన్ సాయం దక్కట్లేదు.
రైతులకు పెట్టుబడి సాయం అందించే వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకాన్ని కేంద్ర స్కీం పీఎం కిసాన్‌తో అనుసంధానించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏడాదికి రూ.13,500 మూడు విడతల్లో ఇస్తామని రాష్ట్రం చెబుతోంది. వాటిలో కేంద్రం వాటా రూ.6 వేలు. రాష్ట్రం ఇచ్చేది 7,500 మాత్రమే . కేంద్ర నిబంధనల ప్రకారం దూరమవుతున్న వారికి అటు కేంద్రం.. ఇటు రాష్ట్రం అకౌంట్లలో నగదు జమ చేయడం లేదు. దీంతో వారు నష్టపోతున్నారు.