Minister Venu Gopala Krishna : వైద్య విద్యార్థులకు వైఎస్ఆర్ స్ఫూర్తి, ఎన్టీఆర్ ను కించపర్చలేదు- మంత్రి చెల్లుబోయిన
Minister Venu Gopala Krishna : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినంత మాత్రాన ఆయన స్థాయి తగ్గించినట్లు కాదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు.
Minister Venu Gopala Krishna : తూర్పుగోదావరి జిల్లా ఫూలే సత్య సాధక్ సమాజ్ వేడుకల్లో మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన మంత్రి చెల్లుబోయిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించారు. శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ స్పష్టంగా చెప్పారని, ఎన్టీ రామారావు పట్ల ఎలాంటి వివక్ష లేదన్నారు. ఆయనపై గౌరవంతోనే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టామన్నారు. రాష్ట్రంలో వైద్య కాలేజీలు 8 నుంచి 13 అవ్వడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణమని జగన్ చాలాసార్లు చెప్పారన్నారు. వైసీపీ ప్రభుత్వం వాటిని 28 కాలేజీలకు పెంచారన్నారు. వైద్య విద్యార్థులకు ఒక స్ఫూర్తిని కలిగించాలనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలనే పేరు మార్చామన్నారు.
ఎన్టీఆర్ స్థాయిని తగ్గించలేదు
"ఎన్టీ రామారావు గౌరవం ఎక్కడ తగ్గించలేదు. కించ పరచలేదు. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉంది. ఆరోజు పేరు మార్పుపై చర్చ మొదలుపెట్టకుండానే అసెంబ్లీలో టీడీపీ గొడవ చేసింది. చంద్రబాబు వల్ల రాష్ట్రంలో మోసపోని వర్గంలేదు. వంచనకు గురికాని వర్గం లేదు. నిజం మాట్లాడే జగన్మోహన్ రెడ్డి అంటే టీడీపీకి భయం. "- మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ
చంద్రబాబుది విజన్ కాదు పాయిజన్
ఎన్టీ రామారావు మహిళలకు ఇచ్చిన ఆస్తి హక్కును సీఎం జగన్మోహన్ రెడ్డి మరింత ముందుకు తీసుకువెళుతూ ఇళ్లపట్టాలను మహిళ పేరు మీద అందిస్తున్నారని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. కృష్ణాజిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టే వరకు ఎన్టీఆర్ టీడీపీ గుర్తురాలేదని విమర్శించారు. మహిళలపై చంద్రబాబు నాయుడు చాణిక్యుడు, కౌటిల్యుడు కాలంనాటి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. పేరు మార్పులో బాబు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకి ఉన్నది విజన్ కాదు పాయిజన్ అని మండిపడ్డారు. మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే బాధపడ్డారన్నారు. ఎన్టీ రామారావుకి వారి కుటుంబం చేసినంత అన్యాయం రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేదన్నారు. ఎన్టీ రామారావు పేరు అటకెక్కించడం వారికి సంతోషమన్నారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెడితే సంతోషించలేదని ఆరోపించారు.
వైఎస్ఆర్ ను అవమానించే విధంగా జగన్ తీరు- విష్ణువర్ధన్ రెడ్డి
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం పేరు మార్పుపై షర్మిల వ్యాఖ్యలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ ను అవమానించే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని షర్మిల అన్నారు. ఎన్టీఆర్ పేరు తీసేయడం కోట్ల మందిని అవమానించినట్లేనన్నారు. షర్మిల వ్యాఖ్యలు నేరుగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండించినట్లుగా ఉండటంతో విపక్షాలు ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీ అధినేతను ప్రశ్నిస్తున్నాయి. వైఎస్ఆర్ కుమార్తె షర్మిల వ్యక్తం చేసిన అభిప్రాయంతో పేరు మార్చిన కుమారుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నాయి. అదే అంశాన్ని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి తన వ్యవహారశైలి మార్చుకోవలాని లేకపోతే ప్రజలే మార్పు చేసే రోజులుకు దగ్గరకు వచ్చాయని స్పష్టం చేశారు.
Also Read : Balakrishna About NTR: మార్చెయ్యటానికీ, తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు: బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు
Also Read: NTR: ఇలా చేస్తే YSR స్థాయి పెరగదు - ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై తారక్ స్పందన