East Godavari: జవాద్ తుపానుతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం... వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు... కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
జవాద్ తుపానుతో తూర్పుగోదావరి జిల్లా అధికారులు, ప్రజల్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. వచ్చే మూడు రోజులూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 4న పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తుపాను మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కోరారు. మధ్య అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడి వాయువ్య దిశలో కదులుతూ ఈ నెల 4న ఉత్తరాంధ్ర-ఒడిశా తీరాన్ని తాకనుందని, దీని ప్రభావంతో డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకూ తూర్పు గోదావరి జిల్లాలో బలమైన గాలులతో భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు.
రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించాలని, ఇప్పటికే సముద్రంలో ఉన్న వారిని వెంటనే తీరానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలని మత్య్సశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పెనుగాలుల వల్ల ప్రమాదాలు సంభవించకుండా పూరిళ్లు, తాటాకు, పెంకుటిల్లలో ఉంటున్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన కోరారు. వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించారు. రానున్న రెండు, మూడు రోజులలో భారీ వర్షాల వల్ల ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగి పొర్లే ప్రమాదం ఉందని, ప్రసవ తేదీకి దగ్గరలో ఉన్న గర్భవతులందరినీ సమీప ప్రభుత్వ ఆసుపత్రులలోని ప్రసవ నిరీక్షణ గదులకు తరలించాలన్నారు. గంటకు 80 కి.మీ. వేగంతో తుపాను ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి రహదారులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.
Also Read: ఉత్తరాంధ్రపై విరుచుకుపడనున్న జవాద్ తుఫాన్.. ముందు జాగ్రత్తలపై సీఎం జగన్ సమీక్ష
ఈ నెల 4న సెలవు
రవాణా అవరోధాలను తొలగించేందుకు అవసరమైన జేసీబీలు, పవర్ కట్టర్లు, రంపాలు, ట్రాక్టర్లను సిద్ధంగా ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ అంతరాయాల వల్ల తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్ని ఎటువంటి అంతరాయం లేకుండా సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. రెవెన్యూ, అగ్నిమాపక, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, పోలీస్ తదితర రక్షణ, సహాయ శాఖలకు సెలవులు రద్దు చేసి, అధికారులు, సిబ్బంది అత్యవసర విధులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తుపాను హెచ్చరికలను మీడియా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, మండల ప్రత్యేక అధికారులు తమ మండల కేంద్రాలలో ఉండి ముందస్తు జాగ్రత్తలను, సహాయక చర్యలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 4వ తేదీన సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ లో అన్ని డివిజన్ కేంద్రాలలోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని తుపాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు సమాచారం తెలియజేయాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందకు ప్రమాణిక విపత్తు నియంత్రణ కార్యాచరణలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Also Read: వచ్చే 3 రోజులు ఏపీలో భారీ వర్షాలే.. ఈ ప్రాంతాల్లో అతి భారీగా.. వాతావరణ కేంద్రం హెచ్చరిక
కంట్రోల్ రూమ్ నంబర్లు :
1. జిల్లా కలెక్టరు కార్యాలయం, కాకినాడ 1800-425-3077
2. ఆర్డీవో, కాకినాడ కార్యాలయం 0884-2368100
3. ఆర్డీవో, అమలాపురం కార్యాలయం 08856-233208
4. ఆర్డీవో, రామచంద్రపురం కార్యాలయం 08857-245166
5. ఆర్డీవో, పెద్దాపురం కార్యాలయం 9603663227
6. పీవో ఐటీడీఏ, రంపచోడవరం కార్యాలయం 1800-425-2123
7. సబ్ కలెక్టర్, రంపచోడవరం కార్యాలయం 08864-243561
8. సబ్ కలెక్టర్, రాజమండ్రి కార్యాలయం 0883-2442344
9. ఆర్డీవో, ఏటపాక కార్యాలయం 08864-285999, 7331179
Also Read: ఏపీ, ఒడిశాపై జవాద్ తుపాను ప్రభావం... 100కు పైగా రైళ్ల రద్దు... ప్రధాని మోదీ సమీక్ష
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి