CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !
సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదని సీపీఐ నారాయణ స్పష్టం చేశారు. రాజీనామా చేసి సీబీఐ విచారణకు సహకరించాలన్నారు.
CPI Narayana : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాత్ర ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. వివేకా కేసులో జగన్‌ను కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. హత్య కేసులో జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, జగన్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారాయన. సీఎం తన పదవికి రాజీనామా చేయాలి నారాయణ డిమాండ్ చేశారు. తనను కాపాడమని జగన్ ఢిల్లీకి వెళుతున్నాడని ఎద్దేవా చేశారు. సీబీఐకి ఉన్న పరువును అవినాష్ రెడ్డి తీసేశారని, సీబీఐకి ఉన్న విలువను కాపాడాలని నారాయణ కోరారు. జస్టిస్ ఎన్.వి.రమణ న్యాయవ్యవస్థకు అన్యాయం చేశాడని ఆరోపించారు. న్యాయవ్యవస్థ మసకబారిందన్నారాయన.
సీబీఐ, న్యాయ వ్యవస్థ దిగజారి పోయాయన్నారు. న్యాయమూర్తి జగన్ దగ్గరకు పోయి కలవటం ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీకి అనుకూలంగా పనిచేసిన న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత ఉన్నత పోస్టులు కట్టబెట్టారన్నారు. చంపిన వాడు, చంపేందుకు కుట్ర పన్నిన వాడు శిక్షార్హులేనని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. సీబీఐ కోర్టు కు ఇచ్చిన నివేదిక చాలన్నారు. వివేకా హత్యలో సీఎంకు భాగస్వామ్యం ఉంది అనటానికి.. ముఖ్యమంత్రి తక్షణం రాజీనామా చేయాలన్నారు. కర్ణాటకలో దిగజారి పని చేసిన వ్యక్తిని సీబీఐ డెరైక్టర్‌ను చేశారన్నారు.
వివేకా హత్యపై గతంలోనూ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో అవినాష్ రెడ్డి అరెస్టు ఉండదని నారాయణ అన్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ అరెస్టును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంత దూరమైన వెళ్తారని వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిందని, ఆనాడే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి ఉంటే ఇంత జరిగేది కాదని నారాయణ గతంలో ప్రకటించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ రోజు ఇంత దూరం రావడానికి వివేకా కుమార్తె సునీత పట్టుదలే కారణమని సీపీఐ నారాయణ అన్నారు. ఈ విషయంలో సీబీఐ చేసింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. 'వివేకానంద రెడ్డి కుమార్తె సునీత పట్టుదల వల్లే ఈరోజు వివేకా హత్య కేసు ఇంత దూరం రాగలిగింది. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ చేసిందేమీ లేదు' అని నారాయణ అన్నారు.
సీబీఐ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద మోకాలు వంచితే, సీఎం జగన్.. కేంద్రం మంత్రి అమిత్ షా వద్ద మోకాలు వంచారని సీపీఐ నారాయణ మండిపడ్డారు. పులివెందులలో చివరికి ఏ పూల మొక్కను అడిగినా వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో చెబుతుందని నారాయణ వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబం అనుమతి లేకుండా పులివెందులో ఒక్క చీమ కూడా కుట్టదని సీపీఐ జాతీయ నాయకుడు అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కంటే ఎంపీ అవినాష్ రెడ్డి శక్తిమంతుడు ఏమీ కాదని నారాయణ పేర్కొన్నారు. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లో ఎవరైనా ఎంపీ కేసులో చిక్కుకుని ఉంటే.. సీబీఐ అధికారులు వచ్చి ఆ సర్కారును రద్దు చేసి, అరెస్టు చేసి తీసుకెళ్లే వారని నారాయణ వ్యాఖ్యానించారు. కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుందని అంటున్నారు.