(Source: ECI/ABP News/ABP Majha)
APSRTC: ఆర్టీసీ టికెట్లు ఇలా బుక్ చేసుకుంటే ఇక జీఎస్టీ కట్టాల్సిందే.. ఈ పద్ధతిలో అయితే సేఫ్!
బస్సు టికెట్లపై జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ప్రైవేటు ఈ-కామర్స్ పోర్టల్స్, యాప్స్ ద్వారా బుక్ చేసుకునే ఆర్టీసీ నాన్ ఏసీ టికెట్లపై 5 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది.
ఏపీలో కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి త్వరలో కారుణ్య నియామకాలు చేపడతామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఆర్టీసీ హౌస్‌లో నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగం నుంచి వివిధ కారణాలతో వైదొలగిన వారికి రావలసిన ఆర్థిక ప్రయోజనాలను సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. కొత్త ఏడాదిలో సంస్థలో వ్యయాన్ని నియంత్రించి, ఆదాయం పెంచడంపై ఉద్యోగులు దృష్టి పెట్టాలని అన్నారు. పొరుగు రాష్ట్రాల రవాణా సంస్థలతో పోటీ పడి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఎండీ ద్వారకా తిరుమలరావు నిర్దేశించారు.
టికెట్లపై జీఎస్టీ అమల్లోకి..
మరోవైపు, ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. ప్రైవేటు ఈ-కామర్స్ పోర్టల్స్, యాప్స్ ద్వారా బుక్ చేసుకునే ఆర్టీసీ నాన్ ఏసీ టికెట్లపై 5 శాతం జీఎస్టీని వసూలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు అధికారులు జీఎస్టీ విధిస్తున్నారు. దీని ప్రకారం.. పేటీఎం, రెడ్ బస్, అభి బస్ వంటి పోర్టళ్ల ద్వారా బస్ టికెట్లు కొనుగోలు చేసేవారు ఇకపై తప్పనిసరిగా జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది.
అయితే, ఆర్టీసీ సొంత పోర్టల్ ద్వారా లేదా ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు, బస్సుల్లో కండక్టర్ల ద్వారా నేరుగా తీసుకునే టికెట్లకు మాత్రం ఎలాంటి జీఎస్టీ వర్తించబోదు. కాబట్టి జీఎస్టీ డబ్బు మిగిల్చుకోవాలనుకొనేవారు ప్రైవేటు వెబ్ సైట్స్ కాకుండా ఆర్టీసీ పోర్టల్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
సంక్రాంతికి 4 వేల ప్రత్యేక బస్సులు
ఇక సంక్రాంతి డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్‌ఆర్టీసీ 4 వేల స్పెషల్ బస్సు సర్వీసులను నడపనుంది. అయితే, వీటిలో ప్రయాణించే ప్రయాణికుల నుంచి టికెట్‌పై అదనంగా డబ్బులు వసూలు చేయనున్నారు. ఒక్కో టికెట్‌పై సగం ఛార్జీని అదనంగా వసూలు చేయనున్నారు. పండగ రోజుల్లో జనవరి 7 నుంచి 14వ తేది మధ్య వెళ్లే వారితో పాటు వచ్చే నెల 16న అంటే పండగ తర్వాత స్వస్థలాల నుంచి గమ్యస్థానాలకు తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం స్పెషల్ బస్సులను నడపనుంది.
Also Read: GHMC: కరాచీ బేకరీకి జరిమానా.. ఓ నెటిజన్ ఫిర్యాదుతో చర్యలు, ఏం జరిగిందంటే..
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.