CM Ramesh : పొత్తులపై మాట్లాడటానికి వాళ్లెవరు..? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న సీఎం రమేష్ !
తెలుగుదేశం పార్టీతో పొత్తుపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర నేతలు ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా పార్టీ అధ్యక్షుడిదే నిర్ణయమన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానించారు.
సాధారణ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై చర్చ జరుగుతోంది. జనసేన - టీడీపీ కలిస్తే మంచి ఫలితాలు వస్తాయంటూ ఓ వైపు విశ్లేషకులు చర్చలు జరుపుతూ ఆ దిశగా రెండు పార్టీలను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తూంటే.. తాజాగా రేసులోకి బీజేపీ వచ్చింది. టీడీపీతో పొత్తే లేదంటూ జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, సునీల్ ధియోధర్ వంటి వారు అదే పనిగా ప్రకటనలు చేస్తూంటారు. ట్వీట్లు చేస్తూంటారు. అయితే వీరికి భిన్నంగా మాట్లాడారు ఎంపీ సీఎం రమేష్. పొత్తుల గురించి మాట్లాడటానికి వీరెవరని.. ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : అమరావతి రైతుల మహా పాదయాత్రకు నో పర్మిషన్.. శాంతిభద్రతల సమస్య వస్తుందన్న డీజీపీ !
బీజేపీ ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవాలనుకుంటే నిర్ణయం తీసుకోవాల్సింది జాతీయ అధ్యక్షుడని సీఎం రమేష్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని ప్రకటించి కొత్తగా ఊహాగానాలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీఎం రమేష్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్తగా చర్చనీయాంశం అవుతున్నాయి. 2014లో బీజేపీ - జనసేన - టీడీపీ కలిసి పోటీ చేసి అధికారం దక్కించుకున్నాయి. అయితే 2019లో అందరూ ఎవరికి వారే పోటీ చేశారు. ఫలితంగా ఘోర పరాజయం పాలయ్యారు. అప్పట్నుంచి మళ్లీ పొత్తుల గురించి చర్చ జరుగుతూనే ఉంది.
Also Read : హస్తినలో ఏపీ రాజకీయం... టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి వైసీపీ ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీతో పొత్తు గురించి పెద్దగా స్పందించడం లేదు. ఆ పార్టీకి ఒక్క శాతం మాత్రమే ఓటు బ్యాంక్ కనిపిస్తోంది. జనసేన పార్టీ కలిసి వస్తామంటే టీడీపీ సంతోషంగా ఆహ్వానిస్తుంది. 2019 ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో కూడా చంద్రబాబు కలసి రావాలని పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఒక వేళ కలసి వస్తే మూడు పార్టీలు కూటమిగా పోటీ చేయాల్సి ఉంటుంది.
Also Read : జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !
సీఎం రమేష్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, రాష్ట్ర బీజేపీ నేతలు ఇంకా స్పందించలేదు. సీఎం రమేష్ గతంలో టీడీపీలోనే ఉన్నారు. ఆయన టీడీపీ తరపునే ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా పేరుంది. ఈ క్రమంలో సీఎం రమేష్ వ్యాఖ్యలపై బీజేపీలో మరో వర్గం ఎలా స్పందిస్తుందన్నదానిపై ఆసక్తి వ్యక్తమవుతోంది. సీఎం రమేష్ పొత్తులు ఉంటాయని చెప్పలేదు కానీ.. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదని ఆయన చెప్పారు. అది మాత్రం వంద శాతం నిజమని అనుకోవచ్చు.