Jagan Modi Tweet: సీఎం జగన్ - ప్రధాని మోదీ భేటీ, చర్చించిన అంశాలు ఇవే!
ప్రధానితో భేటీ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపెంద్ర యాదవ్‌తో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. బుధవారం (డిసెంబరు 28) మధ్యాహ్నం 12.30 గంటలకు వీరి భేటీ జరిగింది. పోలవరం ప్రాజెక్టు సహా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్టు నుంచి అక్కడి అధికారిక నివాసానికి చేరుకున్నారు.
ఏపీకి రుణ పరిమితి పెంపుపైన కూడా ప్రధానిని అడిగినట్లుగా తెలుస్తోంది. వీటితోపాటు ఏపీకి ప్రత్యేక హోదా, మెడికల్ కాలేజీలు, తెలంగాణ విద్యుత్ బకాయిలు, బీచ్ శాండ్ మైనింగ్, కడప స్టీల్ ప్లాంట్ ఇతర విభజన సమస్యలు తదితర అంశాలపై కూడా ప్రధానికి సీఎం జగన్ వినతి పత్రం అందజేశారు. ఇవి కాకుండా రాజకీయ పరమైన అంశాలపై కూడా ఇరువురూ చర్చించుకున్నట్లు తెలిసింది.
అయితే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని, పోలవరం అనుకున్న సమయానికి పూర్తికాదని, బిల్లులు త్వరగా చెల్లిస్తున్నామని చెప్పడం, విజయవాడ మెట్రోపై సవరించిన డీపీఆర్ కోరడం సహా అనేక అంశాలపై ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం సమాధానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సీఎం జగన్ వివిధ అంశాలపై ప్రధానిని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధానితో భేటీ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపెంద్ర యాదవ్‌తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రాత్రి 10 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అవుతారు.
ముఖ్యమంత్రితో పాటు వైఎస్ఆర్ సీపీ కీలక నేతలు కూడా ఉన్నారు. పార్టీ పార్లమెంటరీ నేత వి.విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.