Jagan Foreign Trip: ఈ 17 నుంచి విదేశీ పర్యటనకు వెళతా - సీబీఐ కోర్టును పర్మిషన్ అడిగిన సీఎం జగన్
Andhra Pradesh News : విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టు పర్మిషన్ అడిగారు. పోలింగ్ ముగిసిన తర్వాత 17వ తేదీన ఆయన విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.
Andhra CM Jagan : వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 17 నుంచి ఫ్రాన్స్ ,స్విట్జార్లాండ్ ,యూకే వెళ్లేందుకు అనుమతి కావాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. కౌంటట్ దాఖలు చేయాలని సీబీఐ ని కోర్టు ఆదేశించింది. శుక్రవారం విచారణలో జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ పై విడుదలైనప్పుడు ఆయన షరతుల్లో భాగంగా పాస్ పోర్టును కోర్టుకు సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడికైనా విదేశీ పర్యటనకు వెళ్లాలంటే ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకుని కోర్టు దగ్గర ఉన్న పాస్ పోర్టు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సీఎం అయినందున ఆయనకు డిప్లమాటిక్ పాస్ పోర్ట్ ఉంటుంది. అయినప్పటికీ కోర్టు షరతుల్ని పాటించాల్సి ఉన్నందన విదేశాలకు వెళ్లే ముందు కోర్టు పర్మిషన్ తీసుకుంటారు.
సీఎంగా నాలుగు సార్లు విదేశీ పర్యటన
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. మొదటగా ఇజ్రాయెల్ జెరూసలెం పర్యటనకు వెళ్లారు. తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికాలోని ఆ కాలేజీలో కుమార్తెను జాయిన్ చేశారు. ఆ తర్వాత ఒక సంవత్సరం ఫ్యామిలీతో పాటు దావోస్ వెళ్లారు. పెట్టుబడుల సదస్సులో పాల్గొని .. అటు నుంచి విహారయాత్రను పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. మరోసారి లండన్ పర్యటనకు వెళ్లారు. ఆయన లండన్ లో ఉన్నప్పుడే చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఇలా ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా పాస్ పోర్టును కోర్టు పర్మిషన్ తో తీసుకుని వెళ్తారు. మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత కోర్టులో డిపాజిట్ చేస్తారు.
మే పదమూడో తేదీన ఏపీలో పోలింగ్ ముగిసిపోతుంది. కౌంటింగ్ జూన్ నాలుగో తేదీన జరుగుతుంది. ఈ లోపు ఇరవై రోజుల వరకూ సమయం ఉంది. అందుకే గత నెలన్నర రోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం, ఎన్నికల వ్యూహాల నుంచి విశ్రాంతి తీసుకుని కుటుంబంతో గడపాలని జగన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్ లో నివాసం ఉంటారు. అక్కడే చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది. విహారయాత్రకు ఎప్పుడు వెళ్లినా జగన్ కుటుంబం యూరప్ కు ఎక్కువగా వెళ్తుంది. అథ్యాత్మక టూర్ అయితే జెరూసలెం వెళ్తారు.