Chandrababu Naidu: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఏసీబీ కోర్టులో పిటిషన్, మంగళవారం విచారణ
Chandrababu Naidu: చంద్రబాబు హెల్త్ బులిటెన్ అందజేయడం లేదని ఆయన కుటుంబసభ్యులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు కోర్టులో విచారణ జరగనుంది.
Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడలోని ఏసీబీ కోర్టును కుటుంబసభ్యులు ఆశ్రయించారు. చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ మేరకు కుటుంబసభ్యుల తరపున చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు నివేదిక ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. వైద్యులు రిపోర్ట్స్ ఇవ్వడానికి నిరాకరించారని చంద్రబాబు లాయర్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
అయితే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రిపోర్ట్స్ మెయిల్‌లో వచ్చాయని ఏసీబీ కోర్టు జడ్జి తెలిపారు. ఫిజికల్ కాపీ అందిన తర్వాత ఇస్తామని చంద్రబాబు లాయర్లకు జడ్జి చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు తమకు నివేదిక ఇవ్వలేదని, ఈ నెల 12న పరీక్షలు నిర్వహించిన తర్వాత జైలు అధికారులు కూడా తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని పిటిషన్‌లో పొందుపర్చారు. అధికారులు చెప్పిన అంశాలతోనే రిపోర్ట్ ఇస్తున్నారని కుటుంబసభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో పాటు పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు తెలిపింది.
అయితే చంద్రబాబు ఆరోగ్యంపై గత కొంతకాలంగా ఏపీలో వివాదం నడుస్తోంది. చంద్రబాబు బరువు తగ్గారని కుటుంబసభ్యులు చెప్పగా.. ఒక కేజీ బరువు పెరిగినట్లు జైలు అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు శరీరం రంగు మారిందని, చర్మంపై దద్దుర్లు, అలెర్జీ వచ్చినట్లు రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ కలకలం రేపింది. చంద్రబాబును చల్లని వాతావరణం ఉంచాలని వైద్యులు సూచించారు. అలాగే పలు రకాల మెడిసిన్స్ కూడా సిఫార్సు చేశారు. ఈ క్రమంలో చంద్రబాబుకు జైల్లో ఏసీ కల్పించాలని ఏసీబీ కోర్టులో బాబు లాయర్లు పిటిషన్ వేశారు. దీంతో బాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
చంద్రబాబుకు ప్రమాదకర స్టెరాయిడ్స్ ఇస్తున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించగా.. తన భర్తను చంపేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీంతో చంద్రబాబుకు వైద్య పరీక్షలు, చికిత్స అందించేందుకు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిటెండెంట్ ప్రత్యేక వైద్యుల బృందాన్ని నియమించారు. ఈ బృందం జైలుకు చేరుకుని బాబును పరీక్షించింది. బాబు ఆరోగ్యం తీవ్రంగా ఉందని వైద్యులు రిపోర్ట్ ఇవ్వడంతో మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఈ మేరకు ప్రత్యేక వీవీఐపీ గదిని కూడా సిద్దం చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని జైలు అధికారులు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందంటూ ఆదివారం హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు. వైద్యులు ఎప్పటికప్పుడు బాబుకు టెస్ట్‌లు చేస్తున్నారని, మెడిసిన్స్ కూడా సిఫార్సు చేస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు ఏసీ కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.