Chandrababu: వాళ్లు కొత్త బిచ్చగాళ్లు.. వన్ టైం ఛాన్సే ఇదీ, జనం తరిమి కొడతారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు శుక్రవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీల మధ్య పొత్తులు ఉండొచ్చని అన్నారు. తాము కూడా పొత్తుల వల్లే గతంలో గెలిచామని, అవే పొత్తుల వల్ల ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. నిన్న (జనవరి 6) చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా జనసేనతో పొత్తు గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ‘వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవాలని కార్యకర్తలు కోరారు. ఈ సందర్భంగా.. లవ్ వన్ సైడ్ కాదు.. రెండు వైపులా ఉండాల’ని వ్యాఖ్యానించారు. ఏకపక్ష లవ్ సరికాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే, తాను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ చంద్రబాబు నేడు (డిసెంబరు 7) స్పష్టత ఇచ్చారు. అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులు ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పటి పరిస్థితులను బట్టి పొత్తులు పుట్టుకొస్తాయి తప్ప.. సాధారణ పరిస్థితుల్లో రావు. అంతేకానీ, పొత్తుల వల్లే గెలుస్తామనే వైఎస్ఆర్ సీపీ నేతల మాటలు సరికాదని కొట్టిపారేశారు. వారికి ఏమీ తెలీదని, కొత్త బిచ్చగాళ్లంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఒక్క ఛాన్స్ అన్నారు.. మీకిచ్చిన అవకాశం అయిపోయింది. భవిష్యత్తులో మిమ్మల్ని తరిమికొట్టే పరిస్థితి వస్తుంది.’’ అని చంద్రబాబు మాట్లాడారు.
కుప్పంలో కొనసాగుతున్న రెండో రోజు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు శుక్రవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకరమైన పాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకరమైన పాలన పోవాలంటే ధర్మపోరాటం తప్పనిసరి అని అన్నారు. టీడీపీ ఇప్పుడు అదే చేస్తోందని అన్నారు. ధర్మ పోరాటానికి ప్రతి ఒక్కరూ కలసి ముందుకు రావాలని పిలుపిచ్చారు. పొత్తుల వ్యవహారంపై వైఎస్ఆర్ సీపీ నేతలు మాట్లాడుతున్న తీరు పనికిమాలినవి అని విమర్శించారు.
కుప్పంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు రెండోరోజు పర్యటన - ప్రత్యక్ష ప్రసారం. https://t.co/pyUJhTubrX
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) January 7, 2022
Also Read: Corona Cases: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. తగ్గినట్టే కనిపించి ఎక్కువవుతున్న కేసులు
Also Read: Nellore Crime: ఈ చోరుడు మహా ముదురు... పోలీసు స్టేషన్ లోనే దొంగతనం... పోలీసుల కన్నుగప్పి బైకులు చోరీ