Constable Death Issue : పాముకాటుతో కానిస్టేబుల్ మృతిపై చంద్రబాబు ఆవేదన - ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆగ్రహం !
అమరావతి ప్రాంతంలో పాముకాటుతో కానిస్టేబుల్ మృతి చెందడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Constable Death Issue : అమరావతిలో రైతులు ఇచ్చిన పొలాల దగ్గర జరుగుతున్న పనులకు రక్షణగా ఉంటున్న ఓ కానిస్టేబుల్ పాముకాటుతో చనిపోవడం సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ పవన్ కుమార్ ఇటీవల తుళ్లూరు మండలం అనంతరంలో పాముకాటుకు గురికావడం, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ లో బందోబస్తుకు వచ్చి పాము కాటుకు గురైన కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి బాధాకరమని పేర్కొన్నారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు సరైన వసతి కూడా కల్పించలేని ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యమే పవన్ కుమార్ ప్రాణాలు తీసిందని చంద్రబాబు మండిపడ్డారు. తమ దౌర్జన్యాలకు పోలీసులను వాడుకోవడమే కానీ, వారి క్షేమం గురించి ఆలోచించలేని ప్రభుత్వం ఇది అని తీవ్ర విమర్శలు చేశారు.
పవన్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్నానని వెల్లడించారు. కానిస్టేబుల్ పవన్ కుమార్ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని, ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజధాని అమరావతిలో R5 జోన్ లో బందోబస్తుకు వచ్చి పాముకాటుకు గురైన కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి బాధాకరం. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు సరైన వసతి కూడా కల్పించలేని ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యమే పవన్ కుమార్ ప్రాణాలు తీసింది. తమ దౌర్జన్యాలకు పోలీసులను వాడుకోవడమే కానీ వారి క్షేమం… pic.twitter.com/Sh7lyebIW6
— N Chandrababu Naidu (@ncbn) May 25, 2023
ఆర్-5 జోన్ లో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీకి సన్నద్ధమవుతుండగా, ఇతర ప్రాంతాల నుంచి పోలీసు బలగాలను ఇక్కడకు రప్పించారు. ఆర్-5 జోన్ లో బందోబస్తు విధుల కోసం ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన కానిస్టేబుల్ పవన్ కుమార్... రాత్రి వేళ తుళ్లూరు మండలం అనంతవరం ఆలయం వద్ద ఇతర కానిస్టేబుళ్లతో పాటు విశ్రమించారు. నిద్రిస్తుండగా పాము కాటు వేయడంతో, ఆయన పామును పట్టుకుని ఇవతలికి లాగారు. దాంతో పాము చేతిపై కూడా కాటు వేసింది. ఆయనను ఇతర కానిస్టేబుళ్లు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ్నించి మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి చెందారు.
గత ప్రభుత్వం అమరావతి కోసం భూములు సమీకరించింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులేమీ చేయకపోవడంతో అక్కడంతా పెద్ద ఎత్తున ముళ్ల చెట్లు పెరిగిపోయాయి. అడవిలా మారింది. ఇటీవల ఆ స్థలాల్లో ఆర్ 5 జోన్ పేరుతో ఏర్పాటు చేసి సెంటు స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు అడ్డుకుంటారన్న ఉద్దేశంతో బందోబస్తును ఏర్పాటు చేశారు. కానీ బందోబస్తుకు వచ్చిన వారికి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ నిద్రించాల్సి వస్తోంది. అసలే అడవిలా ఉండటంతో పాములు తరచూ బయటకు వస్తున్నాయి. ఇలా కింద పడుకున్న కానిస్టేబుల్ ను నిద్రలోనే కాటు వేయడంతో ఆయన ప్రాణం పోయింది.