APSDC Row : అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘన..! ఏపీకి కేంద్రం సంచలన లేఖ..!? అసలేం జరుగుతోందంటే..?
ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న ప్రభుత్వం. రెండు రాజ్యాంగాల అధికరణాలను ఉల్లంఘించారని వివరణ కోరిన కేంద్రం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. "ఏపీ స్టేట్‌డెలవప్‌మెంట్ కార్పొరేషన్" పేరుతో చేసిన అప్పులపై కేంద్రం అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ... వివరాలు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2020లో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటైంది. ఆ కార్పొరేషన్ రూ 21,500 కోట్ల రుణ సమీకరణకు అయిదు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పులు తీసుకుంది. వాటిని సంక్షేమ పథకాల కోసం ఉపయోగించుకుంది. అయితే ఆ రుణాల గురించి ఎక్కడా చెప్పలేదు. అసెంబ్లీకి చెప్పలేదు. దీంతో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్.. వాటికి సంబంధించిన పత్రాలను బయట పెట్టారు. అప్పటి నుండి రాజకీయంగా సంచలనం అయింది.
కార్పొరేషన్ ఏర్పాటు, ఆదాయం మళ్లింపు రాజ్యాంగ విరుద్ధం..!
ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ "ఏపీఎస్‌డీసీ" అప్పులపై కేంద్రానికి కూడా ఫిర్యాదులు వెళ్లడంతో దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. అప్పులు చేసిన వైనం చూసిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ కార్పొరేషన్ ఏర్పాటు రాజ్యాంగంలోని 293 (3) అధికరణకు విరుద్ధమని.. ఎలా ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. అదే సమయంలో కార్పొరేషన్‌కు పన్నుల ఆదాయం మళ్లింపు కూడా రాజ్యాంగంలోని 266(1) అధికరణను ధిక్కరించినట్లుగా తేలినట్లుగా లేఖలో పేర్కొన్నారు.
భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన..!
ఏపీఎస్‌డీసీకి రుణం రావాలంటే.. ఆ కార్పొరేషన్‌కు ఆదాయం చూపించాలి. తిరిగి చెల్లించే మార్గం చూపించాలి. ఇందు కోసం ఎక్సైజ్ ఆదాయాన్ని అంటే... మద్యం ఆదాయాన్ని ఆ కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారు. దీని కోసం ఎస్క్రో ఖాతాలు ప్రారంభించారు. మామూలుగా అయితే పన్నుల అదాయం.. కన్సాలిడేటెడ్‌ఫండ్‌కు చేరాలి. కానీ అలా చేరకుండా నేరుగా కార్పొరేషన్‌కు అక్కడ్నుంచి బ్యాంకులకు తరలిస్తున్నారు. అంటే వచ్చే ఆదాయం అంతా అప్పుల కిందే జమ చేస్తున్నారు. అంటే.. ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారన్నమాట. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆర్థిక నిపుణులు కొంత కాలంగా చెబుతున్నారు. ఆ ప్రకారమే కేంద్రం రాజ్యాంగ ధిక్కరణపై వివరణ కోరినట్లుగా తెలుస్తోంది.
గతంలోనే ఐవైఆర్, పీవీ రమేష్ హెచ్చరిక..!
ఏపీఎస్‌డీసీ కార్పొరేషన్ రుణాలపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ వివరాలు బయట పెట్టక ముందు... ఆర్థిక వ్యవహారాల్లో పట్టు ఉన్న రిటైర్డ్ ఐఏస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, పీవీరమేష్ వంటి వారు కూడా... అప్పుల సేకరణలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని ప్రకటించారు. అప్పు కోసం ఎపీఎస్‌డీసీ ప్రభుత్వ అనుసరించిన విధానం ఖచ్చితం... కేంద్ర ఆర్థిక నిబంధనలకు.. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని వారు గతంలో సోషల్ మీడియాలో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేంద్రం అదే రీతిన లేఖ పంపింది.
అధికారులే బలి కాబోతున్నారా..?
ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం చాలా సీరియస్‌గా వ్యవహరించే అవకాశం ఉందని.. ఢిల్లీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం.. పూర్తి స్థాయిలో రుణాలను వినియోగించుకోవడమే కాక.. వివిధ రకాల లెక్కలు చెబుతూ.. అదనపు రుణాలు తీసుకుంది. వీటిని గుర్తించి ఇప్పటికే రుణ పరిమితిని తగ్గించింది. ఇప్పుడు కొత్తగా ఆస్తులు, ఆదాయాలను తాకట్టు పెట్టి అప్పులు తేవడం... వివాదాస్పదమవుతోంది. ఈ వ్యవహారంలో ప్రధానంగా అధికారులు బలిపశువులయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం నిపుణుల్లో వినిపిస్తోంది.