YS Viveka Case : చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న కోర్టు - అవినాష్ రెడ్డికి నోటీసులు !
వివేకా కేసులో సీబీఐ చార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆగస్టు 14వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది.
YS Viveka Case : వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలని వైకాపా ఎంపి అవినాష్ రెడ్డికి సమన్లు పంపింది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్ ను సిబిఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి,ఉదయ్ కుమార్ రెడ్డిపై ఛార్జిషీట్ వేసింది. వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా సిబిఐ అవినాష్ రెడ్డిని చేర్చింది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు చేసిన కుట్రలో నిందితుల పాత్ర స్పష్టంగా ఉందని సీబీఐ దాఖలుచేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది. హత్యకు డబ్బు సమకూర్చిందెవరో తేలాల్సి ఉందన్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఈ కేసులో సీబీఐ కోర్టుకు అనుబంధ అభియోగపత్రం సమర్పించింది. ఇందులో A-6గా ఉదయ్‌కుమార్‌రెడ్డి, A-7గా వై.ఎస్.భాస్కరరెడ్డి, A-8గా వై.ఎస్.అవినాష్‌రెడ్డిలను పేర్కొంది. వివేకా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఎం.వి.కృష్ణారెడ్డి, వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మి కుమారుడు ఏదుల ప్రకాష్‌లను ఇదే కేసులో అనుమానితులుగా పేర్కొంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసినా.. ఇంకా దర్యాప్తు కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వివేకా చనిపోయే ముందు రాసిన లేఖలో నిగూఢ వేలిముద్రలనూ గుర్తించడంలో భాగంగా లేఖను కోర్టు నుంచి సీబీఐ తీసుకుని, దిల్లీ ఎఫ్ఎస్ఎల్కు పంపింది. నిన్‌హైడ్రిన్ పరీక్ష ద్వారా వేలిముద్రలను గుర్తించాలని కోరింది. ఎం.వి.కృష్ణారెడ్డి, వంటమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాష్‌లను అనుమానితులుగా పేర్కొంది. వీటన్నింటిపై స్పష్టత నిమిత్తం దర్యాప్తును మరికొంతకాలం కొనసాగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి విజ్ఞప్తిని కోర్టులకు చేయలేదు. గడువు సుప్రీంకోర్టే నిర్ణయించినందున.. అదనపు గడువు కోసం కూడా ఆ కోర్టు దగ్గరే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి.
అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి రాజకీయ విభేదాలతో కక్ష పెంచుకుని వివేకా హత్యకు కుట్ర పన్నడం ప్రారంభించారని సీబీఐ తెలిపింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల డివిజన్ మినహా మిగిలిన ప్రాంతాల్లో గెలవడం వైసీపీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొంది. గెలుస్తానన్న ధీమాతో వివేకా తన డివిజన్‌ను వదిలి ఇతర డివిజన్లపై దృష్టి సారించారని.. పులివెందుల వ్యవహారాలను అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి పర్యవేక్షిస్తూ వివేకా ఓటమికి కారకులయ్యారని తెలిపింది. వెన్నుపోటు గురించి తెలుసుకున్న వివేకా ఆగ్రహం వ్యక్తం చేసి, గంగిరెడ్డిని పలుమార్లు తిట్టారని పేర్కొంది. ఎంపీ టికెట్ దక్కకుండా వివేకా ప్రయత్నించారని అవినాష్ కక్ష పెంచుకున్నారని.. దీంతో నేరచరిత్ర ఉన్న శివశంకర్‌రెడ్డి ద్వారా హత్యకు కుట్రపన్నినట్లు ప్రాసంగిక సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయని అభియోగపత్రంలో సీబీఐ తెలిపింది.