AP BJP Meetings : పొత్తులు కావాలని టీడీపీతో చెప్పించండి - పవన్‌కు సలహా ఇచ్చిన ఏపీ బీజేపీ నేత
Satyakumar : బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని టీడీపీతో చెప్పించాలని బీజేపీ నేత సత్యకుమార్ పవన్‌కు సూచించారు. రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశాల తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
AP BJP Comments On Alliances : బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్న పార్టీలు మా అధిష్టానాన్ని సంప్రదించాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సూచించారు. బీజేపీ హైకమాండ్‌తో టీడీపీ నేతలను పవన్ టచ్‌లోకి తీసుకెళ్లాలంటూ సత్యకుమార్ సలహా ఇచ్చారు. ఏపీ బీజేపీ నేతలతో అత్యవసరంగా సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పొత్తుల అంశంపై ప్రధానంగా చర్చకు వచ్చింది. బీజేపీ పార్టీ బలోపేతంతో పాటు, ఏపీలో పొత్తులపై ఎలా వెళ్లాలనే అంశంపై కోర్ కమిటీ రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ సమావేశంలో రాష్ట్ర నేతలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సమావేశం తర్వాత సత్యకుమార్ భిన్నమైన వ్యాఖ్లు చేశారు.
బీజేపీతో పొత్తులు కావాలంటే హైకమాండ్‌ను సంప్రదించాలి !
పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని.. మాతో పొత్తులు పెట్టుకోవాలని కోరుకుంటున్న పార్టీలు మా అధిష్టానంతో మాట్లాడాలన్నారు. బీజేపీ పొత్తు కోరుకుంటున్నామని టీడీపీ నేతలతో పవన్ కూడా మాట్లాడించాలన్నారు. యువగళం వేదిక మీదే బీజేపీతో పొత్తు కోరుకుంటున్నామని పవన్ టీడీపీతో చెప్పించి ఉండాల్సిందని సత్యకుమార్ వ్యాఖ్యానించారు ఏపీలో మేం బలహీనంగా ఉన్నాం.. దేశంలో మేం బలంగా ఉన్నామని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల వ్యూహాలపై బీజేపీ ఏపీ శాఖ కసరత్తు చేసింది. మా సలహాలను.. సూచనలను జాతీయ పార్టీ తీసుకుంది. సంస్థాగతంగా పార్టీని విస్తరించడం.. బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతపై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 175 సెగ్మెంట్లల్లో పార్టీ బలోపేతంపై చర్చించాం. కేంద్రం ఏపీకి చేసిన మేళ్లను ప్రజలకు వివరించడంలో మేం వెనుకబడ్డాం. ఏపీలోని పథకాలన్నీ కేంద్ర నిధులు.. కేంద్ర పథకాలతోనే నడుస్తున్నాయి. ఏపీలో బీజేపీపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడతాం. విభజన హామీలన్నింటినీ నెరవేర్చాం. విభజన హామీలు ఏమైనా పెండింగులో ఉంటే.. దానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. ఏపీ బీజేపీ చేరికల కమిటీ, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సత్యకుమార్ చెప్పారు.
పొత్తులపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తెలుసుకున్న హైకమాండ్
ఇతర పార్టీలతో పొత్తులపై నేతల నుంచి జాతీస సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ జీ అభిప్రాయాలు తీసుకున్నారు. పొత్తులపై ఏపీ బీజేపీ ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిగింది. దాదాపు ఐదు గంటల పాటు చర్చ జరిగింది. పొత్తుల్లేకుండా పోటీ చేయగలమా అనే అంశం పైనా అభిప్రాయ సేకరణ జరిగినట్లు తెలిసింది. పొత్తుల్లేకుండా పోటీ చేస్తే.. ఓట్లు పెరుగుతాయోమో కానీ.. సీట్లు రావని పలువురు నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. జనసేనతో పొత్తు కొనసాగుతోందనే అంశాన్ని నేతలు స్పష్టంగా చెప్పాలన్నారు. టీడీపీతో పొత్తు అంశాన్ని అధిష్టానానికి వదిలేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఏయే సీట్లల్లో బీజేపీ పోటీ చేయడానికి ఆస్కారం ఉందనే అంశం పైనా చర్చించారు. ఏపీలో అమిత్ షా పర్యటనలోగానే పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని నేతలు శివ ప్రకాష్ జీని కోరారు.
త్వరలో పొత్తులపై నిర్ణయం
పొత్తులపై ఏపీ బీజేపీ ముఖ్య నేతల నుంచి శివ ప్రకాష్ జీ రాతపూర్వకంగా అభిప్రాయాలను కోరారు. రాతపూర్వకంగా ఇచ్చిన అభిప్రాయాలను ఆయన అధిష్ఠానం ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది. పొత్తుల గురించి బహిరంగ కామెంట్లు చేసే అంశంపై వాడీ వేడీ చర్చ జరిగింది. పొత్తుల గురించి మాట్లాడే స్థాయి ఏపీ నాయకులది కాదనే విషయాన్ని పలువురు నేతలు గుర్తుంచుకోవాలన్నారు. కొందరు నేతలు పొత్తుల స్థాయి దాటి సీట్లు కేటాయింపు వరకు మాట్లాడ్డంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పలువురు బీజేపీ నేతలు.పొత్తులపై బహిరంగంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు నేతలు సూచించారు.