Balakrishna : రాజకీయాల్లో రెండో వైపు చూపేందుకు బాలకృష్ణ రెడీ ! ఫ్యాన్స్‌తో కీలక వ్యాఖ్యలు
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటి వరకూ ప్రజా పోరాటాల్లో కనిపించలేదు. అఖండ తర్వాత ఆయన ప్రభుత్వపై పోరాటానికి రోడ్డెక్కాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీలో ప్రజాకర్షణ ఉన్న నేతల్లో ఒకరు బాలకృష్ణ. అయితే ఆయన హిందూపురానికి మాత్రమే పరిమితమయ్యారు. అక్కడ ఎమ్మెల్యేగా బాధ్యతలు లేకపోతే సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ఇంకా పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. అదే సమయంలో ప్రభుత్వంపై టీడీపీ చేపడుతున్న ఉద్యమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. బాలకృష్ణ రోడ్ల మీదకు వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందన్న అభిప్రాయం చాలా కాలం నుంచి అయితే ఇప్పుడా సమయం దగ్గర పడుతున్నట్లుగా ఉంది. నెల్లూరు జిల్లాకు చెందిన కొంత మంది అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆయనను కలిసినప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమా తర్వాత తాను ప్రభుత్వంపై ఉద్యమాలకు నేతృత్వం వహించబోతున్నట్లుగా తెలిపారు.Also Read : అచ్చెన్న, నిమ్మలకు అసెంబ్లీలో నో మైక్ ! స్పీకర్‌కు ప్రివిలేజ్ కమిటీ కీలక సిఫార్సు
నెల్లూరు జిల్లాకు చెందిన కార్యకర్తలు వైసీపీ పాలనలో తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాల గురించి చెప్పినప్పుడు బాలకృష్ణ ఆవేశానికి గురయ్యారు. తమపై దాడులు చేస్తున్నారని .. తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నందుకు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని వారు బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బాలకృష్ణ బోయపాటి సినిమా తర్వాత తాను రోడ్లపైకి వస్తానని వారికి భరోసా ఇచ్చారు. " నా అసలు అవతారం చూపిస్తా.. నేనేంటో, నా సంగతి ఏంటో చూపిస్తా.. " అని స్పష్టం చేశారు. ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. దేనికీ భయపడవద్దు.. అయ్యేదేదో అవుతుంది. నేను మానసికంగా ప్రిపేర్ అవుతున్నా.. దేనికైనా సిద్ధమని బాలయ్య వారికి తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టంగా మారిందని బాలకృష్ణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
. Also Read : ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ! రోడ్డున పడుతున్న రాజమండ్రి వైఎస్ఆర్‌సీపీ రాజకీయం !
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయ ఉద్యమాల విషయంలో బాలకృష్ణ ఇప్పటి వరకూ యాక్టివ్ పార్ట్ తీసుకోలేదు. కానీ ఇక ముందు తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అఖండ సినిమా రిలీజ్ తర్వాత బాలకృష్ణ రాజకీయాల కోసం ఎక్కువ సమయం కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికల మూడ్ కనిపిస్తున్న సమయంలో ఆయన ఒక్క హిందూపురం విషయంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.Also Read : వైఎస్‌ఆర్‌సీపీ పంతం - టీడీపీ నిర్లక్ష్యం ! కుప్పంలో కదిలిన చంద్రబాబు పునాదులు !
తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కూడా బాలకృష్ణకు ప్రజల్లో ఉన్న ఆదరణను మరింతగా ఉపయోగించుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ వ్యూహకర్తలు ఈ అంశంపై ఓ ప్రణాళిక రూపొందించి ఉంటారని అంచనా వేస్తున్నారు. అదే నిజం అయితే బాలకృష్ణ ప్రభుత్వంపై పోరాటంలో కీలకంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నారు.
Also Read : 3 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే.. సీఎం జగన్