YSRCP Raja Vs Bharat : ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ! రోడ్డున పడుతున్న రాజమండ్రి వైఎస్ఆర్‌సీపీ రాజకీయం !
తూ.గో జిల్లా వైఎస్ఆర్‌సీపీలో రాజా వర్సెస్ భరత్ రాజకీయ పోరాటం రోడ్డున పడుతోంది. ఒకరిపై ఒకరు మీడియా ముందు తీవ్ర విమర్శలు చేసుకుంటూండటంతో సర్దుబాటు చేసేందుకు వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో యువ ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉన్న వైసీపీ నేతలు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. వీరిద్దరినీ వైసీపీ హైకమాండ్ కూడా సముదాయించలేకపోతోంది. ఫలితంగా విభేదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అసలు వీరిద్దరి మధ్య ఎక్కడ తేడాలు వచ్చాయి..? ఎందుకు బద్ద శత్రువులుగా మారారు ?
టీచర్ దీపక్‌పై దాడి ఘటనతో బహిరంగమైన గొడవలు !
వారం రోజుల కిందట సీతానగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల గణిత అధ్యాపకుడు పులుగు దీపక్ అనే వ్యక్తిపై కొంత మంది దాడి చేశారు. వారంతా రాజానగరం ఎమ్మెల్యే రాజా అనచరులు. ఆయన ఎంపీ భరత్‌తో సన్నిహితంగా ఉంటారు. కొన్ని సేవాకార్యక్రమాలు కూడా చేపట్టారు. కొన్ని వివాదాల కారణంగా ఆయనను ఓ సారి ఎమ్మెల్యే పిలిపించి హెచ్చరించారు. తర్వాతఈ దాడి ఘటన జరిగింది. దాడి తర్వతా పులుగు దీపక్‌ను ఎంపీ భరత్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గాయపడిన టీచర్ దీపక్ తనపై ఎమ్మెల్యేనే దాడి చేయించారని ఆరోపించడం.. ఆయనకు ఎంపీ భరత్ అండగా ఉండటంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.
Also Read : వైఎస్ఆర్సీపీ పంతం - టీడీపీ నిర్లక్ష్యం ! కుప్పంలో కదిలిన చంద్రబాబు పునాదులు !
మొదటి నుంచి రాజా వర్సెస్ భరత్ మధ్య ఆధిపత్య పోరాటం - ఒకరిపై ఒకరు ఫిర్యాదులు
రాజానగరం నియోజకవర్గంలో పేదలకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కొనుగోలు చేసింది. అవి అవ భూములు. అంటే వర్షం పడితే మునిగిపోయే భూములు. విలువే చేయని వాటికి లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇదంతా ఎంపీ భరత్ కనుసన్నల్లో జరిగిందని స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేను అయిన తనను అధికారులు సంప్రదించకుండానే వాటిని కొనుగోలు చేశారని ఆయన చెబుతూ వస్తున్నారు. భూముల కొనుగోలులో అక్రమాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అయితే ఎంపీ మాత్రం తనకే మాత్రం సంబంధం లేదని వాదించి జక్కంపూడి రాజాపై ఇతర కుంభకోణాల ఆరోపణలు చేయడం ప్రారంభించారు.
Also Read : అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం.. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గతంలో సెల్ఫీ వీడియో
మూడు నియోజకవర్గాల్లో ఇరువురి మధ్య ఆధిపత్య పోరాటం !
రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండు నియోజకవర్గాలపై పట్టు కోసం ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వరకు ఆ నియోజకవర్గాలకు జక్కంపూడి రాజా వర్గీయులే ఇంచార్జులుగా ఉండేవారు. ఇప్పుడు ఎంపీ భరత్ తన వర్గీయులు అయిన ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ కుమారుడు చందన నాగేశ్వర్‌ను కోఆర్డినేటర్‌లుగా నియమింప చేసుకున్నారు. అదే సమయంలో జక్కంపూడి రాజా ఎమ్మెల్యేగా ఉన్న రాజా నగరంలోనూ తనదైన వర్గాన్ని పెంచుకుంటున్నారు. దీంతో రాజా వర్గీయులు ఎదురుదాడులు ప్రారంభించారు. రెండు వర్గాలుగా రాజానగరం వైసీపీ విడిపోయింది. భరత్‌కు ఎమ్మెల్యేవర్గం హెచ్చరికలు జారీ చేస్తోంది. నియోజవకర్గంలోకి రావొద్దని స్పష్టంచేస్తోంది.
Also Read : రూ.9వేల కోట్ల హెరాయిన్ వెనుక అసలు కథేంటి ? కింగ్ పిన్ ఎవరో ఎలా తేలుతుంది ?
సర్దుబాటు చేసేందుకు పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు !
హైకమాండ్ ఇద్దరు యువ నేతల మధ్య విబేధాలను పరిష్కరించి కలిసి పని చేసుకునేలా చేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఎవరో ఒకరే ఉండాలన్నట్లుగా వారు రాజకీయం చేస్తున్నారు. ఎంపీకి వ్యతిరేకంగా కార్యకర్త - జనబాట పేరిట రాజమహేంద్రవరంలో ఎంపీకి ప్రత్యామ్నాయంగా కార్యక్రమాలు నిర్వహించాలని జక్కంపూడి రాజా నిర్ణయించారు. వీరి వ్యవహారం రాను రాను వైసీపీలో కలకలం రేపుతోంది. ఇతర నేతలు పని చేయలేని పరిస్థితి ఏర్పడటంతో ఇప్పుడు హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
Also Read : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్.. వెంటిలేటర్ తొలగింపు