Sajjala : బాహుబలి టిక్కెట్లపై సజ్జల వ్యాఖ్యలు దేనికి సంకేతం ? ఇండస్ట్రీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?
బాహుబలి టిక్కెట్ల అమ్మకాల లెక్కలను పరిశీలిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ఇవి బెదిరింపులుగా కొంత మంది భావిస్తున్నారు.
ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో బాహుబలి టిక్కెట్ల వ్యవహారంపై మాట్లాడటం కొత్త చర్చకు దారి తీస్తోంది. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పవన్ పైవిమర్శలు చేసి ఆయనకు టాలీవుడ్‌లోనే మద్దతు లేదని చెప్పారు. అంత వరకూ బాగానే ఉన్నా టిక్కెట్ల అంశంపైనా స్పందించారు. ఈ క్రమంలో బాహుబలి చిత్రం గురించిన ప్రస్తావన తీసుకు వచ్చారు. బాహుబలి సినిమాకి తొలివారం 50 శాతమే టికెట్లు బుక్ అయినట్లు చూపారని అంటున్నారని... ఈ అంశంపై ఒకసారి చెక్ చేయాల్సి ఉందన్నారు. చెప్పుకొచ్చారు. ఒక వేళ అదే నిజమైతే అంతకంటే ఘోరం ఇంకేమీ ఉండదన్నారు. బాహుబలికి మొదటి వారంలో సగం టికెట్లే అమ్ముడైనట్టు చూపితే మోసం చేసినట్టేనని స్పష్టం చేశారు.
Also Read : పవన్‌కు అనుకూలమా ? వ్యతిరేకమా ? . "మా" ఎన్నికల అజెండా సెట్ చేసిన మంచు విష్ణు !
అసలు ప్రస్తుతం జరుగుతున్న వివాదానికి బాహుబలికి అసలు సంబంధమే లేదు. ఎప్పుడో ఆరేడేళ్ల కిందట విడుదలైన సినిమా గురించి ఆ సినిమాల కలెక్షన్ల గురించి ఇప్పుడు సజ్జల వ్యాఖ్యానించడం వ్యూహాత్మకమేనన్న అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. బాహుబలి మొదటి సినిమా 2015లో వచ్చింది.. రెండో భాగం 2017లో వచ్చింది. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కనీసం పదిహేను రోజుల పాటు రిలీజైన అన్ని ధియేటర్లలోనూ హౌస్ ఫుల్ అయిందనేది బహిరంగ రహస్యం. నిజంగానే అప్పట్లో ధియేటర్ల యజమానులు సగం టిక్కెట్లే అమ్ముడయ్యాయని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టారా.. ఆ సమాచారం సేకరించిన తర్వాతనే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడి ఉంటారన్న అభిప్రాయం కొంత మందిలో వినిపిస్తోంది.
Also Read : బన్నీ- లెక్కల మాస్టారు తగ్గేదే లే అన్నారు...ఇప్పుడు తగ్గక తప్పడం లేదా...
ఒక వేళ నిజంగా అలా చేసి ఉంటే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవచ్చు. కానీ అలా చూపించారన్న విషయాన్ని కూడా స్పష్టంగా కూడా చెప్పలేదు. అలా అంటున్నారని పరిశీలించాల్సి ఉందని సజ్జల అంటున్నారు. అంటే ఓ రకంగా అది బెదిరింపు అని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే .. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మద్దతిస్తే అన్ని సినిమాల కలెక్షన్లు బయటకు తీస్తామన్న సంకేతాన్ని సజ్జల పంపారని అంటున్నారు. ధియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయో అందరికీ తెలుసని చెప్పడం ద్వారా ఈ హెచ్చరికను నేరుగానే పంపారని అంటున్నారు. టిక్కెట్లు ఎన్ని అమ్ముడయ్యాయో లెక్క చెప్పి జీఎస్టీ కట్టేది ధియేటర్లే. ఏదైనా తప్పు జరిగితే ధియేటర్ ఓనర్లు, లీజుకు తీసుకున్న వారే బాధ్యులవుతారు.
Also Read : పూరీకి ఏమైంది? 8 నెలలుగా మౌనం.. బర్త్ డే విషెస్‌కు కూడా చార్మీయే రిప్లై
తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వంతో లేని ఇబ్బంది ఏపీ ప్రభుత్వంతోనే ఎలా వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు. సమస్య ఏమిటో అందరికీ తెలుసు కానీ పరిష్కారం కోసం అందరూ ఒకే దారిలో పయనించే పరిస్థితి లేదు.
Watch Video : ప్రాణాలతో చెలగాటం.. కరెంట్‌తో చేపలకు గాలం..!