Volunteers Resignation: వామ్మో ఆ పని చేయలేమంటూ ఏడుగురు వాలంటీర్ల రాజీనామా
Volunteers Resignation: వాలంటీర్లు పని చేస్తున్న ఏడుగురు యువకులు.. పని ఒత్తిడిని తట్టుకోలేక రాజీనామా చేశారు. పని ఎక్కువవడమే కాకుండా జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేరని తెలిపారు.
Volunteers Resignation: ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సిస్టమ్ వాలంటీర్ల వ్యవస్థ. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక ఏడుగురు వాలంటీర్లు ఒకేసారి రాజీనామా చేశారు. పని ఎక్కువ ఇవ్వడంతో పాటు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకపోవడంతోనే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారి రాజీనామాను మాత్రం ఎంపీడీఓ ఇంకా ఆమోదించలేదు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ సచివాలయంలో.. ఏడుగురు వాలంటీర్ల ఒకేసారి రాజీనామా చేశారు. గ్రామ సచివాలయంలో పని చేస్తున్న వాళ్లు... పని ఒత్తిడి తట్టుకోలేక శుక్రవారం రోజు రాజీనామా పత్రాలను స్థఆనిక ఎంపీడీఓకు అందజేశారు. అయితే ప్రతీ వాలంటీర్ 50 ఇళ్లను మాత్రమే పర్యవేక్షిస్తుంటారు. కానీ సజ్జలదిన్నె గ్రామంలో మాత్రం ఒక్కో వాలంటీర్ 70 నుంచి 80 ఇళ్లను పర్యవేక్షించాల్సి వస్తోంది. ఇందుకు కారణం గ్రామంలో వాలంటీర్ల సంఖ్య తక్కువగా ఉండటమే. ఎక్కువ గృహాలు కేటాయించడం వల్ల పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుందట. ణరో వైపు జీతాలు కూడా సరైన సమయానికి రావట్లేదట.
అందుకే రాజీనామా ఆమోదించలేదు!
ఇవన్నీ తట్టుకోలేక వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన ఎంపీడీఏ రంగారావు... పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. అలాగే జీతాలు కూడా కాస్త ఆలస్యంగా వస్తున్నాయని తెలిపారు. అయితే క్లస్టర్లు పెంచి వాలంటీర్లను నియమించేందుకు పైఅధికారులతో మాట్లాడతానని తెలిపారు. రాజీనామా చేస్తున్నట్లు పత్రాలు అందించిన వారికి న్యాయం చేస్తానని తెలిపారు. అందుకే వారి రాజీనామాను ఆమోదించలేదని వివరించారు.
వాలంటీర్లపై సర్పంచి కుమారుడి అరాచకం..
నెల రోజుల క్రితం విధులకు ఆలస్యంగా వస్తున్నారన్న కోపంతో సచివాలయం సిబ్బందితోపాటు వాలంటీర్లను సైతం బయటకు నెట్టేశాడో వైసీపీ నేత కుమారుడు. అంతేనా అసభ్య పదజాలంతో అందరి ముందు ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ పరువు తీసేశారు. అతను చేస్తున్న అరాచకాన్ని అలాగే చూస్తుండిపోయారే తప్ప ఎవరూ నోరు మెదపలేదు. తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
సర్పంచి కుమారుడే బయటకు నెట్టేశారు..
జిల్లాలోని చంద్రగిరి మండలం గంగుడుపల్లి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లును సర్పంచ్ బోడిరెడ్డి ధర్మారెడ్డి కుమారుడు క్రాంతి కుమార్ రెడ్డి కార్యాలయం నుంచి బయటకు గెంటేశారు. విధులకు ఆలస్యంగా వస్తున్నారన్న నెపంతో తరచూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని 9 మంది సచివాలయ సిబ్బంది, 9 మంది వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేం మొదటిసారి కాదని, గతంలో కూడా చాలా సార్లే అసభ్య పదజాలంతో దూషించారంటూ వాపోయారు. ఘటన జరిగిన అనంతరం 18 మంది కలిసి కార్యాలయం ఎదుట ధర్నాకి దిగారు. పంచాయితీ కార్యక్రమంలో నేతలు కాకుండా వారి పిల్లలు పెత్తనం చెలాయించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు మద్యం సేవించి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
సర్పంచి కుమారుడు క్రాంతి కుమార్ రెడ్డి గతంలో కూడా రెండు సార్లు కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయంలో సమావేశాలకు హాజరై వచ్చినా.. ఆలస్యంగా ఎందుకు వస్తున్నారని సర్పంచ్ కుమారుడు క్రాంతి కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు కచ్చితమైన హామీ ఇస్తే కానీ తాము విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. ఇలా తరచుగా వేధింపులకు గురి చేస్తే.. ఎవరూ పని చేయలేరని తెలిపారు.